శ్రీవారి అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణగా మరి రూపాయి తగ్గించిన మిల్లర్స్

  Written by : Suryaa Desk Updated: Sun, Aug 18, 2019, 12:46 AM
 

 అఖిల‌భార‌త రైస్ మిల్ల‌ర్స్ అసోసియేష‌న్ ప్ర‌తినిధుల‌తో శ‌నివారం తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో టిటిడి తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి   ఎవి.ధ‌ర్మారెడ్డి స‌మావేశం నిర్వ‌హించారు. ఇందులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రైస్ మిల్ల‌ర్స్ అసోసియేష‌న్‌, తెలంగాణ రైస్ మిల్ల‌ర్స్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.


స‌మావేశం అనంత‌రం ప్ర‌త్యేకాధికారి మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో రోజుకు ల‌క్షా 60 వేల మంది భ‌క్తుల‌కు నాణ్యంగా, రుచిక‌రంగా అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ చేస్తున్న‌ట్టు తెలిపారు. ఇందుకోసం రైస్ మిల్ల‌ర్లు నాణ్య‌మైన బియ్యం స‌ర‌ఫ‌రా చేస్తున్నార‌ని చెప్పారు. రాబోవు మూడు నెల‌ల కాలానికి స‌ర‌ఫ‌రా చేసే బియ్యానికి గాను కిలోకు ఒక రూపాయి చొప్పున త‌గ్గించేందుకు రైస్ మిల్ల‌ర్లు అంగీక‌రించార‌ని తెలిపారు. ప్ర‌స్తుతం కిలో రూ.38/- గా ఉండ‌గా, ఇక‌పై కిలో రూ.37/- చొప్పున బియ్యం స‌ర‌ఫ‌రా చేస్తార‌ని వివ‌రించారు. ఇక‌పై కొంత‌మేర‌కు బియ్యాన్ని విరాళంగా ఇవ్వాల‌ని మిల్ల‌ర్ల‌ను కోర‌గా వారు సానుకూలంగా స్పందించిన‌ట్టు తెలిపారు. ప్ర‌స్తుతం అసోసియేష‌న్ ప్ర‌తినిధులు 375 క్వింటాళ్ల బియ్యాన్ని విరాళంగా అందించేందుకు ముందుకొచ్చార‌ని వెల్ల‌డించారు.


అఖిల‌భార‌త రైస్ మిల్ల‌ర్స్ అసోసియేష‌న్ ఛైర్మ‌న్   గుమ్మ‌డి వేంక‌టేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున అన్న‌దానం చేస్తున్న టిటిడికి నాణ్య‌మైన బియ్యం స‌ర‌ఫ‌రా చేసేందుకు తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని చెప్పారు. ఇక‌పై తాము టిటిడికి విక్ర‌యించే బియ్యంతోపాటు కొంత మేర బియ్యాన్ని విరాళంగా ఇస్తామ‌ని తెలియ‌జేశారు.


అఖిల‌భార‌త రైస్ మిల్ల‌ర్స్ అసోసియేష‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి   మోహ‌న్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల అసోసియేష‌న్ల‌తో చ‌ర్చించి టిటిడికి బియ్యం విరాళాల‌ను పెంచేందుకు కృషి చేస్తామ‌ని వెల్ల‌డించారు.