బ్యాంకులకు టీటీడీ భారీ స్కీం

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 17, 2019, 07:17 PM
 

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బ్యాంకులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా పొగైన చిల్లర నాణేలను తీసుకుంటే అంతే మొత్తంలో ఆయా బ్యాంకుల్లో టీటీడీ డిపాజిట్లు చేయనున్నట్లు టీటీడీ ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి తెలియజేశారు. పరకామణిలో పేరుకుపోయిన చిల్లర గుట్టలను తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రతినెలా రూ.ఐదుకోట్ల వరకు భక్తులు నాణేల రూపంలో శ్రీవారికి కానుకలు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిల్లరను లెక్కపెట్టి డిపాజిట్‌ చేసుకోవడానికి బ్యాంకులు ఆసక్తి చూపలేదు. దీంతో పరకామణిలో నాణేలు రోజురోజుకూ పెరిగిపోయాయి. టీటీడీలో ప్రక్షాళనపై దృష్టి పెట్టిన ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి చిల్లర నాణేలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రూ.20 కోట్లను స్వీకరించేందుకు బ్యాంకులు అనుమతించాయి. కాలం చెల్లిన నాణేలను స్వీకరించేందుకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ముందుకొచ్చింది. విదేశీ కరెన్సీ, చిరిగిన నోట్లను కూడా మారకం చేసేలా చర్యలు తీసుకుంటామని ధర్మారెడ్డి తెలిపారు.