శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ బిశ్వభూషణ్

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 23, 2019, 05:46 PM
 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ముందుగా వరాహస్వామిని దర్శించుకున్న ఆయన.. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. శ్రీవారి ఆలయం వద్ద తితిదే అధికారులు బిశ్వభూషణ్‌కు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా బిశ్వభూషణ్‌ను తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సత్కరించి స్వామి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. దర్శనం తర్వాత బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. వేంకటేశ్వరుడి ఆలయ సందర్శన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఎప్పటినుంచో తిరుమలకు రావాలని అనుకుంటున్నా సాధ్యపడలేదన్నారు. ఆ భగవంతుడి ఆశీర్వాదంతో దర్శించుకునే మహద్భాగ్యం కలిగిందని చెప్పారు.