హైదరాబాద్‌ లాంటి నగరాలు నిర్మిస్తేనే ఏపీకి ఆదాయం : చంద్రబాబు

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 22, 2019, 09:14 PM
 

వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు భావిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడూతూ వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు సరైనవేనని రాజధాని రైతులు చెబితే తాను దేనికైనా సిద్ధమని సవాల్‌ విసిరారు. గతంలో కూడా వైసీపీ నేతలు అమరావతి నిర్మాణానికి అడ్డుపడ్డారని, పంటపొలాలను తగులబెట్టారని, రైతుల్లో కొందరిని రెచ్చగొట్టారని ఆరోపించారు. రాజధానికి వ్యతిరేకంగా ప్రపంచబ్యాకుకు లేఖలు రాశారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాజధాని భూసమీకరణలో 7 వేల ఎకరాల భూమి మిగులుతుందని, ఆ భూమితో అమరావతి ప్రాజెక్టు పూర్తి చేయగలమని అన్నారు. బెంగళూరు, హైదరాబాద్‌ లాంటి నగరాలు నిర్మిస్తేనే ఏపీకి ఆదాయం వస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాజధానిలో భూముల ధరలు పడిపోయాయని విమర్శించారు. భూములు ఇచ్చిన రైతులకు ఇప్పుడు దిగులు పట్టుకుందన్నారు. అమరావతి ప్రాజెక్ట్‌లో ఎలాంటి అవినీతి జరగలేదని సృష్టం చేశారు. గతంలో అమరావతిలో ప్రపంచబ్యాంకు బృందం పర్యటించిందని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. రాజధాని అమరావతిపై వైసీపీ ప్రభుత్వ దుర్మార్గమైన నిర్ణయాల కారణంగా కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.