మద్యం ప్రియులకు ఇది ముమ్మాటికి బ్యాడ్‌న్యూసే

  Written by : Suryaa Desk Updated: Fri, Jul 19, 2019, 11:06 AM
 

పెగ్గు వేశాక కిక్కు ఎక్కుతుందో లేదో కానీ.. ఈ వార్త వినగానే కిక్కు దిగిపోవడం ఖాయమో..! ఎందుకంటే మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. చీప్ లిక్కర్ నుంచి హై క్లాస్ బ్రాండ్ వరకు ఏదీ వదలకుండా.. అన్ని బ్రాండ్లపై భారీగా వడ్డించేందుకు సిద్ధమవుతోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ఓవైపు క్రమంగా మద్యపానాన్ని నిషేధిస్తామంటున్న ఏపీ సర్కార్.. మరోవైపు పెగ్గు వేసిన వారి కిక్కు దించుతామంటోంది. ఇక, అక్టోబర్‌ నుంచి ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగి మద్యం దుకాణాలను నిర్వహించబోతోంది. దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖకు సర్కార్ నుంచి ఆదేశాలు అందాయి. ఇప్పుడున్న దాదాపు 20 శాతం మద్యం షాపులకు కోత విధించనుండగా.. మిగతా లిక్కర్ షాపులను ప్రభుత్వమే నిర్వహించనుంది. ఈ సరికొత్త విధానం అక్టోబరు 1 నుంచి అమల్లోకి రాబోతోంది. ఇక మద్యం ధరల విషయానికి వస్తే క్వార్టర్‌కు కనీసం రూ.50కి పైనే పెంచనున్నారట. తక్కువ ధరలో దొరికే చీప్ లిక్కర్ లాంటి బ్రాండ్లపై కూడా భారీ వడ్డింపు తప్పదంటున్నారు. అయితే, ఈ సారికి బార్లకు మినహాయింపే ఉంటుంది.. బార్లకు 2022 మార్చి 31 వరకు ఎటువంటి మార్పు ఉండబోదు. ఆ తర్వాత వాటిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.