మాయావతి సోదరుడికి ఐటీ శాఖ షాక్

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 18, 2019, 03:12 PM
 

ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి సోదరుడికి ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన దాదాపు రూ.400కోట్ల విలువైన ఏడెకరాల భూమిని జప్తు చేసింది. దీనికి సంబంధించి ఐటీ శాఖ బినామీ ప్రొహిబిషన్ యూనిట్ జులై 16న ఉత్తర్వులు జారీ చేయగా... దాన్ని గురువారం అమలు చేశారు. ఆనంద్ కుమార్‌తో పాటు ఆయన భార్య విచితర్ లత పేరుపై ఉన్న న్యూఢిల్లీ, నోయిడాలోని ఆస్తులను జప్తు చేశారు.ఆనంద్ కుమార్‌ను గత జూన్‌లో బీఎస్పీ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించారు. నోయిడా అథారిటీలో క్లర్కుగా పనిచేసిన ఆయన.. అనంతరం నకిలీ కంపెనీల పేరుతో కోట్ల రూపాయలు రుణాలు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. 2007లో మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనంద్ 49 కంపెనీలు ప్రారంభించారు. దీంతో ఆయన ఆస్తుల విలువ ఒకేసారి రూ.1316 కోట్లకు చేరింది. దీనిపై అప్పటి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆనంద్ కుమార్ ఆస్తులపై విచారణ ప్రారంభించింది. తాజాగా ఐటీ శాఖ బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ యాక్ట్ 1988 సెక్షన్ 24(3) ప్రకారం చర్యలు ప్రారంభించింది.