ఇక తిరుమ‌ల‌లో విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలుండ‌వ్‌ : టిటిడి ఛైర్మ‌న్

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 06:09 PM
 

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే ప్ర‌ముఖులకు కేటాయించే విఐపి బ్రేక్ ద‌ర్శ‌నంలో ఎల్‌1, ఎల్ 2, ఎల్‌3 ల‌ను జూలై 17వ తేదీ బుధ‌వారం నుండి ర‌ద్దు చేస్తున్న‌ట్లు టిటిడి ఛైర్మ‌న్   వై.వి.సుబ్బారెడ్డి వెల్ల‌డించారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో బుధ‌వారం ఉద‌యం టిటిడి ఛైర్మ‌న్‌, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి   ఎ.వి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య‌మంత్రి    వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు తిరుమ‌లకు విచ్చేసే ఎక్కువ మంది సామాన్య భ‌క్తుల‌కు మ‌రింత సౌక‌ర్యావంతంగా, సుల‌భంగా శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా బ్రేక్ దర్శనంలో ఎల్‌1, ఎల్ 2, ఎల్‌3 ల‌ను ఈ రోజు నుండి రద్దు చేస్తున్నామ‌న్నారు. రెండు మూడు రోజుల్లో సాఫ్ట్ వేర్ అప్‌డేట్ చేసిన అనంతరం ఎల్‌1, ఎల్ 2, ఎల్‌3 ల ర‌ద్దును అమలులోకి తీసుకువస్తామ‌న్నారు. ప్రోటోకాల్ ప్ర‌ముఖుల‌కు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ద‌ర్శ‌నం క‌ల్పించ‌నున్న‌ట్లు వివ‌రించారు. ప్ర‌స్తుతం విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాల‌కు 3 గంట‌లకు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌ని, దీనిని అంచెలంచెలుగా త‌గ్గించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు.