న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌పై టీమిండియా కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించారు. వరల్డ్‌కప్ ఫైనల్లో ఓటమి తర్వాత కివీస్ కెప్టెన్ చూపిన సహనాన్ని రవిశాస్త్రి మెచ్చుకున్నారు. ఫైనల్లో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకున్నా.. కేన్ ప్రదర్శించిన హుందాతనం, గౌరవం అసాధారణమైవని రవిశాస్త్రి తన ట్విట్టర్లో తెలిపారు. గత 48 గంటల్లో కేన్ ప్రదర్శించిన సంయమనం, ఔదార్యం, మౌనం.. అనిర్వచనీయమన్నారు. వరల్డ్‌కప్‌పై నీది కూడా ఓ చేయి ఉండాలన్న విషయం మాకు తెలుసు అని రవిశాస్త్రి తన మనసులో మాటను చెప్పేశారు. నువ్వు కేవలం కేన్వే కాదు.. నువ్వు చేయగలవు.. సమర్థుడవంటూ రవిశాస్త్రి ట్వీట్ చేశారు. వరల్డ్‌కప్ ఫైనల్లో మ్యాచ్ టై అయినా.. సూపర్ ఓవర్ నిర్వహించారు. ఆ సూపర్ ఓవర్ కూడా టై అయింది. అయితే బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా ప్రకటించారు. ఆ క్షణం నుంచి న్యూజిలాండ్ జట్టుకు మద్దతుగా మాజీలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రవిశాస్త్రి కూడా తన మనోభావాన్ని ఓ ట్వీట్ రూపంలో కేన్‌కు మద్దతు వ్యక్తం చేశారు. వరల్డ్‌కప్ కోసం టీమిండియాకు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు విండీస్ సిరీస్ కోసం మరో 45 రోజులు పొడిగించారు. ఇక నిన్నే బీసీసీఐ కొత్త కోచ్ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. ఆ నేపథ్యంలో రవిశాస్త్రి.. కేన్ క్రీడాస్పూర్తికి నివాళి అర్పిస్తూ ట్వీట్ చేయడం విశేషం.