ఇసుక కోసం కటకట

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 03:45 PM
 

ఏపీలో నిర్మాణం రంగం ఇప్పుడు రాష్ట్రానికి కీలక సమయం. రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధికి తొలి మెట్టు నిర్మాణం రంగం. అలాంటి నిర్మాణ రంగం ఇప్పుడు సంక్షోభంలో కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇప్పుడు ఇసుక కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ఒక్క యూనిట్ ఇసుక కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలలో నిర్మాణ రంగం వేగంగా ముందుకు వెళ్తుండగా ఇసుక కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నూతన ఇసుక విధానం అమలులోకి వచ్చే వరకు ఇసుక రవాణాను ఆపేయడం, కేవలం ప్రభుత్వ అధికారుల అధీనంలోనే ఇసుక తవ్వకం జరుగుతుండడంతో రెండు జిల్లాలలో ఇసుకకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కొత్త నిర్మాణాలు పూర్తిగా ఆపేయగా ఇప్పటికే మొదలైన నిర్మాణాల కోసం తోట్లవల్లూరు క్వారీలో ఇసుక కోసం ట్రాక్టర్లు, ట్రక్కులు కోలోమీటర్ల మేర క్యూలో ఉంటున్నాయి. రెండు జిల్లాలకు కలిపి ఈ క్వారీలోనే తవ్వకాలు జరుగుతుండగా అక్కడ మొత్తం 12 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వం నూతన ఇసుక విధానం సాధ్యమైనంత త్వరగా అమలుచేసి ఇసుక సరఫరాలో కొరతకు అడ్డుకట్ట వేయకేపోతే నిర్మాణ రంగం ఇంకా కుదేలవడం ఖాయంగా కనిపిస్తుంది.