ఉత్త‌రాంధ్ర‌ను మ‌రో చెన్నై చేస్తారా?

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 01:58 PM
 

ఉత్త‌రాంధ్ర‌కు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వ‌చ్చిన వైసిపి ప్ర‌భుత్వంపై ఇక్క‌డి ప్ర‌జ‌లు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నా  బడ్జెట్‌లో ప్రాజెక్టుల‌కు చేసిన‌ కేటాయింపులు నిరాశాజనకంగా ఉన్నాయని ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ విమర్శించారు.


బుధ‌వారం ఆయన విశాఖ‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మాట్ల‌డుతూ ఇప్ప‌టికే విశాఖ, విజయనగరం సిటీల్లో మంచినీటి కరవు ఏర్పడిందని, ప‌రిశ‌ర ప్రాంతాల‌లోనూ తాగునీటి క‌ష్టాల‌కు కొదువ లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు.  తాగు సాగు నీటి కోసం గ‌త ప్ర‌భుత్వాలు ఆరంభించిన  ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన బాధ్య‌త పూర్తిగా ప్ర‌స్తుత ప్ర‌భుత్వంపై ఉంద‌ని అన్నారు. ఈ ప్రాంత ప్రాజ‌క్టులు పూర్తికాకపోతే ఈ రెండు జిల్లా కేంద్రాల‌తో పాటు ప‌క్క‌నే ఉన్న ప‌లు మండ‌లాల‌లో కూడా తాగేందుకు నీరు దొర‌క‌ని ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని, ఇదే జ‌రిగితే మరో చెన్నై గా మారిపోవ‌టం ఖాయ‌మ‌న్నారు కొణతాల,  ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులకు రూ.24 వేల కోట్లు అందించాల్సిన అవసరం ఉన్న‌ప్ప‌టికీ ఈ సారి బడ్జెట్‌లో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ఆరువందల యాభై కోట్లే కేటాయించడం చూస్తుంటే ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని, . కనీసం ఈ ఏడాది రెండు వేల కోట్లు కేటాయించాలని ఆయ‌న డిమాండ్ చేసారు.