వివాహితను బెదిరించి అత్యాచారం చేస్తున్న యువకులు

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 01:49 PM
 

ఓ వివాహితను బెదిరించి లొంగదీసుకున్న నలుగురు యువకులు ఆమెపై ఏడాదిగా లైంగిక దాడులకు పాల్పడ్డారు. వారి ఆగడాలను ఏడాదిపాటు భరించిన ఆమెకు ఇటీవలి కాలంలో వేధింపులు ఎక్కువయ్యాయి. భర్తను చంపేస్తామని, ముఖంపై యాసిడ్‌ పోస్తామని నలుగురూ బెదిరింపులకు దిగడంతో ఆమె భర్త సాయంతో మంగళవారం పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఓ వీధికి చెందిన మహిళతో పవన్‌ అనే యువకుడు ఫేస్‌బుక్‌ ద్వారా తనతో పరిచయాలు పెంచుకున్నాడు. అతడితో పాటు తన ముగ్గురు స్నేహితులు నరేష్‌, ఫరూక్‌, చిట్టిమల్లిలతో పరిచయం చేయించాడు. అనంతరం స్నేహం పెంచుకుని ఇంటికి రాకపోకలు సాగించేవారు. నలుగురు ఏకమై లైంగిక దాడులకు పాల్పడ్డారు. యేడాది నుంచి తనపై నలుగురు యువకులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు కన్నీరుగార్చింది. సహకరించకపోతే భర్త శంకర్‌తో పాటు తనను, తన కుమారుడిని చంపేస్తానని బెదిరించారని తెలిపింది. వేధింపులు తట్టుకోలేక ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపింది. గత్యంతరం లేక ఆమె భర్తకు విషయం తెలిపి అతని సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళవారం రెడ్‌విత్‌ 34, 376, 370, 354, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు రాయదుర్గం యూపీఎస్‌ సీఐ రియాజ్‌ అహ్మద్‌ తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకొని, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు వివరించారు.