తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకున్న ఆలయాలు

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 11:38 AM
 

చంద్రగ్రహణం కారణంగా నిన్న సాయంత్రం 7గంటలకు ఆలయాలను మూసివేశారు. చంద్రగ్రహణం వీడటంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు తెరుచుకున్నాయి. ఇవాళ ఉదయం నాలుగు గంటల 45 నిమిషాలకు అర్చక స్వాములు శాస్త్రోక్తంగా తిరుమల శ్రీవారి గుడి తలుపులు తెరిచారు. అనంతరం ఆలయ సంప్రోక్షణ, ఫుణ్యాహవాచనం.. సుప్రభాత సేవ, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, శ్రీవారికి అభిషేకాదులు, నిత్య కౌంకర్యాలు నిర్వహించారు. నిన్న అర్థరాత్రి ఒంటి గంట 34 నిమిషాలకు చంద్రగ్రహణం మొదలవ్వడంతో సాయంత్రం 7 గంటలకే అర్చక స్వాములు.. ఈవో, టీటీడీ అధికారుల సమక్షంలో శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. ఇవాళ నాలుగున్నరకు చంద్రగ్రహణం పూర్తికావడంతో.. తిరిగి శాస్త్రోక్తంగా ఆలయాన్ని తెరిచారు. మరోవైపు ఆషాడమాసం సందర్భంగా భక్తులకు మధ్యాహ్నం 12 గంటల నుంచి స్వామివారి దర్శన భాగ్యం కలిగించనున్నారు. కాగా, విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. గ్రహణానంతరం వేదపండితులు, అర్చకస్వాములు ఆలయాన్ని శుద్ధి చేసి, అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకారం, పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనాలకు అనుమతినిచ్చారు.