ఒక్క మిల్లీమీటర్ వర్షం చాలు రోడ్లు చెరువులే!

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 11:11 AM
 

చినుకు చిటుక్కుమంటే రాజధాని అభాగ్య నగరమే.. జనావళికి నరకప్రాయమే... మరోసారి మంగళవారం అదే దుస్థితిని నగరవాసులు ఎదుర్కొన్నారు. నిన్న ఉదయం 8.30 వరకు భాగ్యనగరంలో సరాసరి 1.1 మీ.మీ వర్షం కురిసినట్లు భారత వాతావరణ శాఖ (ఐ.ఎం.డి) ప్రకటించింది. ఒక్క ఎల్బీనగర్ లోనే అత్యధికంగా 40 మీ.మీ వర్షం కురిసింది. సాయంత్రం వరకు ఆకాశం మేఘావృతమై, వర్షపు జల్లులు కురుస్తూనే ఉన్నాయి. మరో వైపు నగరంలో పలు ప్రాంతాలు స్విమ్మింగ్ పూల్స్ ను తలపించాయి. పలు రోడ్లు మోకాలు లోతు నీటితో చెరువుల్లా కనిపించాయి. జూన్ లో నైరుతి రుతుపవనాలు  ఆగమనంతో వర్షాలు కురుస్తాయని భావించినా అవి దోబూచులాడాయే తప్పా కనీస వర్షపాతం కూడా నమోదు కాలేదు. 


అయితే గడిచిన 24 గంటలుగా నగరంలో ఎల్బీనగర్, హిమాయత్ నగర్, నాంపల్లి, శెేరిలింగంపల్లి, ఆసిఫ్ నగర్, షేక్ పేట్, బంజారాహిల్స్, సోమాజీగూడ, మోతీనగర్, మూసాపేట్, మెహిదీపట్నం, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఎస్.ఆర్.నగర్, టోలిచౌకి తదితర ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం వరకు వర్షం కురిసింది.హైదరాబాద్ సహా తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో రానున్న వారం రోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ డైరెక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. వర్షాలతో పాటు, పిడుగులు పడే ప్రమాదముందని చెప్పారు. జులై18 వరకు తెలంగాణలో 25 నుంచి 30 శాతం ప్రాంతంలోనే వర్షపాతం నమోదయిందన్నారు. రాష్ట్రంలో 50 శాతం ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కానున్నట్లు రెడ్డి తెలిపారు.