కాపుల‌పై బాబు స‌వ‌తి ప్రేమ : గుడివాడ‌

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 11:11 PM
 

కాపుల రిజర్వేషన్లపై త‌మ‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కానీ కాపులను ఇంకా మభ్యపెడుతూ టిడిపి సవతి తల్లి ప్రేమ చూపిస్తోంద‌ని దుయ్యబట్టారు  వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌. మంగళవారం ఆయ‌న అసెంబ్లీ మీడియా పాయింట్‌లో పాత్రికేయుల‌తో మాట్లాడుతూ  కాపులకు సంబంధించి  మేనిఫెస్టోలో చెప్పిన హామీ   అమలుకు  చిత్తశుద్ధితో పనిచేస్తామ‌ని అన్నారు. ఇప్ప‌టికే  కాపులకు ఇచ్చిన మాట ప్రకారం  ఏడాదికి  రెండువేల కోట్ల రూపాయలు బడ్జెట్‌ కేటాయించి  సీఎం వైయస్‌ జగన్‌ మాటను నిలుపుకుని  చిత్తశుద్ధి నిరూపించుకున్నార‌ని చెప్పారు. 


 2014లో తెలుగుదేశం పార్టీ  త‌న ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో  కాపులకు 5వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి.. మొదటి సంవత్సరంలో 100 కోట్లు మాత్రమే కేటాయించారని..ఇచ్చింది మాత్రం ఏం లేద‌ని, అలాగే రెండవ సంవత్సరంలో బడ్జెట్‌లో 100 కోట్లు పెట్టి చూపించి కేవ‌లం 90 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. టీడీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో 1800 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని ధ్వజమెత్తారు.  


కాపులను బీసీల్లో చేర్చాలని  ఎన్నో ఉద్యమాలు జరిగాయని, కానీ అధికారంలో ఉన్న‌ప్పుడు  చంద్ర‌బాబుకి కాపులను బీసీల్లో చేర్చాలన్న ఆలోచనే రాలేదన్నారు.  


కేంద్రం ఈబీసీలో వచ్చిన పది శాతాన్ని అందులో 5 శాతం కేటాయిస్తారా లేదా అని టీడీపీ  నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని..40 ఏళ్ల అనుభవం ఏమైపోయిందో మాకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఇది ప్రజలను మోసం చేయడానికి టీడీపీ మ‌ళ్లీ ప్రయత్నం చేయ‌ట‌మేన‌ని అన్నారు గుడివాడ‌.