ఘనంగా ‘శ్రీకూర్మ మహాపురాణము’ గ్రంథావిష్కరణ

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 10:54 PM
 

సంస్కృతంలోని గొప్ప ఆధ్యాత్మిక గ్రంథాల‌ను స‌ర‌ళమైన తెలుగులోకి అనువ‌దించి జ‌న‌బాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు టిటిడి విశేషంగా కృషి చేస్తోంద‌ని తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్ కుమార్ తెలిపారు. టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మంగళవారం ‘శ్రీకూర్మ మహాపురాణము’ గ్రంథావిష్కరణ కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా గ్రంథ అనువాద‌కులు డా.. కెవి.సుంద‌రాచార్యులను జెఈవో శాలువ‌తో స‌న్మానించి శ్రీ‌వారి తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేశారు.


ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో మాట్లాడుతూ గురుపూర్ణిమ నాడు విశిష్ట‌మైన గ్రంథావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా ప‌లుర‌కాల ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాలను నిర్వ‌హించ‌డంలో టిటిడికి స‌ముచిత‌మైన స్థానం ఉంద‌న్నారు. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌ణాళిక‌లు రూపొందించి ధ‌ర్మ‌ప్ర‌చారాన్ని విస్తృతం చేస్తామ‌న్నారు.


టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా|| సముద్రాల లక్ష్మణయ్య మాట్లాడుతూ ఈ గ్రంథాన్ని సంస్కృతంలో వ్యాసుడు ర‌చించార‌ని, ఆయ‌న జ‌యంతి రోజున తెలుగు అనువాద గ్రంథాన్ని ఆవిష్క‌రించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ధ‌ర్మానికి మూలాలు వేదాల‌ని, వాటిలోని త‌త్వాన్ని పురాణాల ద్వారా విస్త‌రింప‌జేయ‌డానికి వ్యాసుడు విశేష‌కృషి చేశార‌ని చెప్పారు.


గ్రంథ అనువాద‌కులు హైద‌రాబాద్‌కు చెందిన డా.. కెవి.సుంద‌రాచార్యులు మాట్లాడుతూ అష్టాద‌శ పురాణాల్లో 17వ‌ది శ్రీ‌కూర్మ మ‌హాపురాణ‌మ‌ని, ఇందులో కూర్మావ‌తారంలో శ్రీ‌మ‌హావిష్ణువు మ‌హిమ‌ల‌ను తెలియ‌జేశార‌ని వివ‌రించారు. శ్రీ‌వారి అనుగ్ర‌హంతోనే ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువ‌దించ‌గ‌లిగాన‌ని తెలిపారు.


ముందుగా అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు ఆల‌పించిన భ‌క్తి సంకీర్త‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.