గ్రామ సచివాలయాల్లోనూ మహిళా కానిస్టేబుల్

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 05:01 PM
 

 రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. భద్రతపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. త్వరలో ఏర్పాటు చేయబోయే గ్రామ సచివాలయాల్లోనూ ఒక మహిళా కానిస్టేబుల్ ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళలు పని చేసే ప్రదేశాల్లో శక్తి బృందాలు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.


ప్రకాశం జిల్లా చినగంజాంలో తెదేపా కార్యకర్త ఆత్మహత్య, కృష్ణా జిల్లాలో ఆశా కార్యకర్త ఆత్మహత్యాయత్నంపై తెదేపా ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అయితే చినగంజాంలో మహిళ ఆత్మహత్యకు పొరుగింటి వారితో గొడవలే  కారణమని మంత్రి వివరించారు. దానికి పార్టీ రంగు పులమడానికి ప్రయత్నించడం సరికాదన్నారు. మచిలీపట్నంలో  ఆశాకార్యకర్త ఆత్మహత్య ప్రయత్నం లేఖపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని హోం మంత్రి వివరించారు.