చంద్రబాబుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్రస్థాయిలో ధ్వజం

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 03:43 PM
 

అమరావతి: అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ జరుగుతుంటే పక్కదారి పట్టిస్తారా? అంటూ ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బడ్జెట్‌పై చర్చను డైవర్ట్‌ చేసేందుకు టీడీపీ యత్నిస్తోందని ఆరోపించారు. కాపులు బీసీలా, ఓసీలా అని చంద్రబాబు తేల్చలేకపోయారని, మోసం చేశారు కాబట్టే ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించారని పేర్కొన్నారు. శాసనసభలో కాపు రిజర్వేషన్లపై చర్చ సందర్భంగా సీఎం జగన్‌ ప్రసంగించారు. 'రిజర్వేషన్ల విషయంలో కాపులను మోసగించారు. దానికి నిదర్శనం మీ పార్టీ తరఫున గెలిచిన సభ్యులే. కాపులకు ఏం చేశారో చెప్పలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. కాపుల విషయం ఇప్పుడు కోర్టులో ఉంది. ఇప్పుడు దానిపై నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం నాకు అలవాటు లేదు. చంద్రబాబు లాంటి మనస్తత్వం కాదు నాది. కాపుల రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మ్యానిఫెస్టోలో ఉంది. దాన్ని బట్టే ఎన్నికలకు వెళ్లాం. మొదటి బడ్జెట్‌లోనే మేము కాపులకు రూ.2వేల కోట్లు కేటాయించాం. రూ.2వేల కోట్లూ ఖర్చు చేస్తాం. ప్రజలు ఎందుకు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారో.. చంద్రబాబు ఇప్పటికైనా తెలుసుకోవాలని' జగన్‌ ఎద్దేవా చేశారు.