పార్టీ ఎంపీలు ప్రధాని మోదీ దిశానిర్దేశం

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 03:00 PM
 

ఢిల్లీ: పార్టీ ఎంపీలు తమ నియోజకర్గంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి, సమస్యలకు సరికొత్త పరిష్కాలతో ముందుకు రావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు జరిగింది. పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోదీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఎంపీలు మానవతా దృక్పథంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. వెనుకబడిన జిల్లాల్లో చేపడుతున్న పనులు కొనసాగించేలా చూడాలన్నారు. అదే తరహాలో మిగిలిన జిల్లాల్లో కూడా పనులు చేపట్టాలని సూచించారు. సాధారణ ప్రజానీకానికి ఉపయోగపడే పనులపై దృష్టి సారించాలన్నారు. ప్రజా ఉద్యమంగా చేపట్టిన జల సంరక్షణ ఉద్యమానికి మద్దతుగా నిలవాలన్నారు. అవగాహన కార్యక్రమాలతో పాటు ప్రజల భాగస్వామ్యం పెంచాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి పనిచేయాలన్నారు.