23ను మూడుకు తగ్గించుకోవద్దు... రోజా సంచలన వ్యాఖ్యలు

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 02:28 PM
 

అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా. ప్రజలు ఛీకొట్టేలా సభలో టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడిన రోజా ఏపీ బడ్జెట్ చూసి చంద్రబాబుకు దిమ్మ తిరిగింది అంటూ సెటైర్లు వేశారు. బడ్జెట్ పై మాట్లాడలేక చంద్రబాబు నాయుడు పారిపోయారంటూ విమర్శించారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు ఏనాడైనా రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని ఘాటుగా విమర్శించారు. వాయిదా తీర్మానం దేనిపై పెట్టాలో కూడా టీడీపీకి తెలియడం లేదని విమర్శించారు. 


అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్న తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. చంద్రబాబుకు ప్రస్తుతం 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆ సంఖ్యను మూడుకు తగ్గించుకోవద్దని హితవు పలికారు. ఇప్పటికే టీడీపీ ఎంపీలందరూ బీజేపీలో కలిసిపోతున్నారని ఇలాగే ప్రవర్తిస్తే ఎమ్మెల్యేలు కూడా అదే దారిలో పయనిస్తారని రోజా పంచ్ లు వేశారు.