స్పందన ఆర్జీలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి : సీఎం జగన్

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 02:23 PM
 

స్పందన ఆర్జీలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. స్పందనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రత్యేక చొరవ చూపకపోతే స్పందన క్లిక్ కాదన్నారు.  ప్రజలను సంతోష పెట్టాలంటే మరింత ఫోకస్ పెట్టాలన్నారు. 7 రోజుల్లో పరిష్కారం కావాలి..ఇందుకు ప్రత్యేక మెకానిజం అనుసరించాలన్నారు. జిల్లా స్థాయిలో పరిష్కార నాణ్యత పరిశీలనా మెకానిజం పెట్టాలన్నారు. మండల స్థాయిలో జరుగుతున్న ఫిర్యాదుల విభాగం జిల్లా కలెక్టర్ కార్యాలయంతో ఆన్ లైన్ లో అనుసంధానం చేయాలన్నారు. మండలంలో తహసిల్దార్ కు అనుమానాలుంటే వాటిని జిల్లా కలెక్టర్ తక్షణమే పరిష్కారం చూపే అవకాశం ఉంటుందన్నారు.  దీనివలన పరిష్కారం మరింత సమర్థవంతంగా జరుగుతుందన్నారు.


అవినీతి ఏ స్థాయిలోను ఉండరాదని, అవినీతిపై దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. వర్షాలు కురుస్తున్నాయి.. వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యవసాయ శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాలు తక్కువగా ఉన్నాయి. తాత్కాలిక ప్రణాళికలు సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటికే విత్తనాల సరఫరాలో కొన్ని ప్రాంతాల్లో కొంత అసంతృప్తి వచ్చిందన్నారు. మార్కెట్ లో లభ్యమయ్యే విత్తనాలు, ఎరువులు తదితర సరుకుల నాణ్యత పరిశీలించాలన్నారు. నాణ్యత లేని వాటిని రైతులు కొనుగోలు చేసి నష్టపోరాదన్నారు. ప్రతీ గ్రామంలో ఉన్నత నాణ్యత గల విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ సామాగ్రి లభ్యమయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఉన్న ప్రతీ వ్యవసాయ సామాగ్రి విక్రయించే దుకాణాలలో నాణ్యత ప్రమాణాలు తనిఖీ చేయాలన్నారు.


ఉగాది నాటికి రాష్ట్రంలో ఇంటి స్థలం లేని నిరుపేద ఉండరాదని, అందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలని అన్నారు.  ఉగాది రోజున నిరుపేదలకు చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో పట్టాల పంపిణీ జరగాలన్నారు. ప్రతీ పట్టాను సక్రమంగా విభజన చేసి లబ్దిదారులకు అందజేయాలన్నారు. ఇంటి స్థలం ఇచ్చారు కానీ.. ఎక్కడ ఉందో చూపించలేదని ఫిర్యాదులు అందరాదని చెప్పారు.  ప్రభుత్వ స్థలాలు పరిశీలించాలన్నారు. ఇసుకపై ఆరోపణలు వస్తున్నాయని, మండల స్థాయిలో మంజూరు చేయుటకు చర్యలు చేపట్టాలన్నారు.  గ్రామ వాలంటీర్ల నియామకం జరిగిన తరువాత వారికి శిక్షణా కార్యక్రమం నిర్వహించాలన్నారు. అందులో జిల్లా కలెక్టర్ పాల్గొనాలని తెలిపారు. ప్రతీ 50 ఇళ్ళకు ఒక వాలంటీరు ఉంటారని, ఆ 50 ఇళ్ల అవసరాలను వాలంటీరు చూస్తారన్నారు. వారి నుండి అవినీతి లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులుండాలని అన్నారు.


విద్యా సంస్థలు, కార్యాలయాల మౌళిక వసతులు, పనితీరు మెరుగు పడాలన్నారు. వాటి ఫోటోలు పెట్టాలన్నారు. ప్రతీ విద్యాసంస్థలో మరుగుదొడ్లు, బ్లాక్ బోర్డ్, ఫ్యాన్, ఫర్నీచర్, పెయింటింగ్, తాగు నీరు ఉండాలన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లీషు మీడియం పాఠశాలలుగా మార్పు చేస్తామన్నారు. విద్యా అంశాల కరిక్యులమ్ మార్పు ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు వసతి గృహాలలో నిద్ర చేయాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం చక్కగా అమలు కావాలన్నారు. వంట ఏజెన్సీల బిల్లులు ఎక్కువ రోజులు పెండింగ్ ఉండరాదన్నారు. జిల్లా కలెక్టర్ జిల్లాలో సమూలమైన మార్పు తీసుకువచ్చి తనదైన ముద్ర వేయాలన్నారు. జిల్లా ప్రజల హృదయంలో చిర స్థాయిగా నిలవాలన్నారు. ఆ విధమైన పనితీరు కనబరచాలన్నారు.