ఎస్వీ మ్యూజియాన్ని మరింత శాస్త్రీయంగా తీర్చిదిద్దాలి : టిటిడి ఈవో సింఘాల్‌

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 12:30 AM
 

 తిరుమలలోని ఎస్వీ మ్యూజియాన్ని మరింత మంది భక్తులు వీక్షించేందుకు వీలుగా మరింత శాస్త్రీయంగా తీర్చిదిద్దాలని టిటిడి ఈవో  అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో సోమవారం సీనియర్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అలిపిరి మెట్ల మార్గంలో అవసరమైన ప్రాంతాల్లో పైకప్పునకు మరమ్మతులు చేపట్టాలన్నారు. తిరుమలలోని క్యూలైన్లు, షెడ్లను మరింత సౌకర్యవంతంగా ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల సౌకర్యార్థం తిరుమలలో జరుగుతున్న సివిల్‌, ఎలక్ట్రికల్‌ పనులను వేగవంతం చేయాలని సూచించారు. కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే భక్తులను దర్శనానికి వదిలే సమయంలో తోపులాట జరగకుండా చర్యలు తీసుకోవాలని సివిఎస్‌వోను కోరారు. ఇందుకు సంబంధించి సివిఎస్‌వో తయారుచేసిన పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ను వీక్షించిన ఈవో పలు సూచనలు చేశారు. తిరుమలలోని ఆర్‌టిసి బస్టాండులోపల గల శ్రీపద్మనాభ వసతి సముదాయంలో భక్తుల లగేజి కౌంటర్‌కు కేటాయించిన ప్రదేశంలో తగిన ఏర్పాట్లు చేపట్టాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. సీతంపేట, రంపచోడవరం, వైజాగ్‌, హైదరాబాద్‌, కురుక్షేత్ర తదితర ప్రాంతాల్లో జరుగుతున్న ఇంజినీరింగ్‌ పనులను ఈవో సమీక్షించి వేగంగా పూర్తి చేయాలని సూచించారు.


ఈ సమావేశంలో టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి   ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్‌వో  గోపినాథ్‌ జెట్టి, ఎఫ్‌ఏ,సిఏవో  బాలాజి, చీఫ్‌ ఇంజినీర్  చంద్రశేఖర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.