అసంతృప్తిలో ఆనం- క‌క్క‌లేక‌... మింగ‌లేక‌...

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 15, 2019, 03:46 PM
 

కాంగ్రెస్ పార్టీ నుంచి హ‌డావిడిగా తెలుగుదేశం పార్టీలో చేరిన ఆనం సోద‌రులు, ఆ పార్టీలో క‌నీసం ఎమ్మెల్సీ అయినా ఇవ్వ‌క పోతారా అని ఆశించారు. అయితే తెలుగుదేశం అధినేత చేద్దాం, చూద్దాం లాంటి ప‌దాలు త‌ప్ప త‌న‌కు ఒర‌గ‌బెట్టిందేంలేద‌ని భావించిన ఆనం రామనారాయణరెడ్డి  త‌న సోద‌రుడు వివేకానంద మ‌ర‌ణం త‌దుపరి తెలుగుదేశం పార్టీని వదలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 


 ఆనం రాకతో నెల్లూరు జిల్లాలో పార్టీకి మంచి ఊపు వచ్చిందనే చెప్పాలి.  వైఎస్ హ‌యాంలోనూ మంత్రిగా ప‌నిచేసి, స‌న్నిహితుడుగా మెలిగిన ఆయ‌న అనుభవాన్ని   జగన్మోహన్ రెడ్డి వినియోగించుకుంటారని, ఖ‌చ్చితంగా మంత్రి వ‌ర్గంలో చోటిస్తార‌ని అంతా భావించారు. కాని ఆనం ను పక్కన పెట్టి,  యువకులైన అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ లకు మంత్రి పదవులు ఇవ్వ‌టంతో ఆయన వర్గం గుస్సాగా ఉందనే చెప్పాలి.  పోనీ నామినేటెడ్ ప‌ద‌వులైనా త‌న వారికి ఇప్పించుకునేందుకు య‌త్నించినా అస‌లు ఆనంనే జ‌గ‌న్ పట్టించుకోవడం లేదని, ఇక త‌మ ప‌రిస్థితి ఏంటో అర్ధం కావ‌టం లేద‌న్న‌ది ఆయ‌న వ‌ర్గీయులు మ‌ధ‌న ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది.  పార్టీకి వ‌చ్చిన తొలినాళ్ల‌లో అత్యంత గౌర‌వ ప్ర‌దంగా చూస్తానంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన ప్ర‌స్తుతం అధికారంలోకి వ‌చ్చాక అనుస‌రిస్తున్న‌ వైఖరి పట్ల అసంతృప్తి వ్య‌క్తం చేయాల‌ని ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. కక్క లేక మింగలేక వారు కొనసాగడం మినహా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నార‌న్న‌ది య‌దార్ధం.