ఏపి అభివృద్ధిలో మేమే కీల‌కం : సుజ‌నా

  Written by : Suryaa Desk Updated: Sun, Jul 14, 2019, 11:18 PM
 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడపడంలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజ‌నా చౌద‌రి. ఇటీవ‌ల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన ఆయ‌న తొలిసారి విజ‌య‌వాడ వ‌చ్చిన సంద‌ర్భంలో మీడియాలో మాట్లాడుతూ అనేక కారణాలతో టీడీపీ బీజేపీని వీడింద‌ని,ఈ  రాజకీయాల వెనుక‌ కారణాలను త్వరలోనే వెల్లడిస్తాన‌ని చెప్పారు.  గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో దేశంలో ఏ రాష్ట్రానికి చెయ్యని కేంద్రం సాయం ఏపీకి చేసిందన్న‌ది వాస్త‌వం.  బీజేపీ రాష్ట్రానికి చేసిన సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవ్వ‌టం వ‌ల్లే ఇటీవ‌ల ఎన్నిక‌ల‌లో త‌గిన ప్రాతినిధ్యం అందుకోలేక‌పోయిన‌ట్టు చెప్పారు సుజ‌నా.  త‌ను అనేక కోణాల్లో ఆలోచించిన తరువాత బీజేపీలో చేరని దేశం, రాష్ట్ర అభివృద్ధి బిజెపితో సాధ్య‌మ‌ని స్ప‌ష్టం చేసారు. గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని చెప్పలేను విచారణ జరిగితే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. గ‌తంలో టీడీపీ పొలిట్ బ్యూరో పార్టీ నిర్ణయం మేరకే మాట్లాడాల్సి వచ్చిందని ఏవీ త‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయాలు కావ‌ని స్ప‌ష్టం చేసారు.  రాష్ట్రానికి భవిష్యత్లో కూడా హోదా ఇవ్వలేమన్న‌ది వాస్త‌వం ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. కానీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై ఇప్పుడే ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు సుజ‌నా.  రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరబోతుంది.నూతన భారతదేశం నిర్మాణం బీజేపీతోనే సాద్యమవుతుందని చెప్పారు.