పంజాబ్ లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

  Written by : Suryaa Desk Updated: Sun, Jul 14, 2019, 04:06 PM
 

ఒంటరితనాన్ని భరించలేని ఓ తెలుగువిద్యార్ధి పంజాబ్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యునికేషన్‌లో బీటెక్ చదువుతున్న ఏపీ విద్యార్థి భరత్ కుమార్.. యూనివర్సిటీ క్యాంపస్‌లోని హాస్టల్ భవనం ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు భరత్ కుమార్ తాను చనిపోతున్నానంటూ ఒక లేఖ రాసి దాన్ని ఫొటో తీసి స్నేహితుడికి పంపించాడు. వెంటనే యూనివర్సిటీ సిబ్బంది ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే భరత్ కుమార్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా భరత్ స్వస్థలం అనంతపురం జిల్లా తాడిపత్రిగా పోలీసులు తెలిపారు.


వెంకట భరత్ కుమార్ ఆత్మహత్యకు సంబంధించి ఫగ్వారా పోలీస్ ఠాణా అధికారి ఓంకార్ సింగ్ వివరాలు వెల్లడించారు. లవ్లీ ప్రెఫెషనల్ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న భరత్ కుమార్ తన ఆత్మహత్య లేఖలో ఒంటరితనం గురించి ప్రస్తావించాడని.. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని రాశాడని ఫగ్వారా పోలీసులు చెప్పారు.ప్రస్తుతానికి మృతుడి గదికి సీల్ వేశామని.. ఆయన కుటుంబ సభ్యులు వచ్చిన తరువాత వారి సమక్షంలో తెరిచి విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.సీసీ టీవీ ఫుటేజీ, ఇతర ఆధారాలు పరిశీలించి దర్యాప్తు చేస్తామని.. పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగిస్తామని స్థానిక పోలీసులు చెప్పారు.