లోట‌స్ పాండ్ కోసం ప్ర‌భుత్వ భ‌వ‌నాలిచ్చేసారుగా : బుద్ధా

  Written by : Suryaa Desk Updated: Wed, Jun 26, 2019, 12:42 AM
 

 ‘అక్రమ కట్టడాలను కూల్చివేయాలని చూస్తే అంత ఉలుకెందుకు.. ఇన్నాళ్లూ చట్టం కళ్లుగప్పారు.. ఇకపై సాధ్యం కాదు’ అంటూ   విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌పై తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు. ప్రజావేదిక అక్రమ నిర్మాణమైతే చెరువును పూడ్చి కట్టిన లోటస్‌పాండ్‌ సక్రమ కట్టడమా అని ప్రశ్నించారు. ఇలాంటి అక్రమాల సక్రమం కోసమేనా ఏపీ భవనాలు తెలంగాణకిచ్చేశారు అని మండిపడ్డారు. కిన్లే వాటర్‌ బాటిల్‌లో రూ.40లు మిగిలించానంటున్న సీఎం జగన్‌ రూ.8కోట్ల ప్రజాధనంతో కట్టిన ప్రజావేదికను ఎలా కూల్చేయమంటున్నారు? అని ప్రశ్నించారు. ప్రజావేదిక చంద్రబాబుకు ఇవ్వడం ఇష్టంలేకపోతే ప్రభుత్వ, ప్రజావసరాలకు ఉపయోగించాలన్నారు. కట్టేవారికి తెలుస్తుంది నిర్మాణాల విలువ.. విధ్వంసకులకు తెలిసేది కూల్చడమేనని విమర్శించారు. అక్రమాస్తులతో కట్టిన లోటస్‌ పాండ్‌ ముందుగా కూల్చాలని.. అప్పుడే మీరు చెప్పే నీతి, నిజాయతీ, నిబద్ధత నిలబడుతుందంటూ వ్యాఖ్యానించారు