న‌ర్సీప‌ట్నంలో లొంగిపోయిన మావోలు

  Written by : Suryaa Desk Updated: Wed, Jun 26, 2019, 12:34 AM
 

సీపీఐ మావోయిస్టు కోరుకొండ దళ సభ్యుడు కొర్ర కృష్ణ, పెదబయలు ఏరియా కమిటీలకు చెందిన అయిదుగురు మిలీషియా సభ్యులు మంగళవారం స్థానిక ఓఎస్డీ కార్యాలయంలో అదనపు ఎస్.పి. బొడ్డేపల్లి కృష్ణారావు ఎదుట లొంగిపోయారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసిన వీరు మావోయిస్టు సిద్ధాంతాల పట్ల విముఖత చెంది లొంగిపోయారని ఓ ఎస్ డి బి. కృష్ణారావు తెలిపారు. జి.మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ (చింతగుప్ప గ్రామం), కొండు కులానికి చెందిన కొర్ర కృష్ణ అలియాస్ ప్రవీణ్ కోరుకొండ దళ సభ్యుడిగా పని చేశారని తెలిపారు. పెదబయలు ఏరియా కమిటీ కి చెందిన గొల్లూరి తాంబ్రు అలియాస్ మల్లన్న  (జమధాంగి గ్రామం), పాంగి అర్జున్ అలియాస్ గోపాలరావు( ఉనుకూరు), పాంగి నాగేశ్వర రావు అలియాస్ రంగారావు (జమధాంగి), బౌడు వెంకటేష్ అలియాస్ చంటి బాబు (ఇంజరి), సిరిమి బాలన్న (చిత్రకొండ, ఒరిస్సా) లు కూడా పోలీసులకు లొంగిపోయారు.


 పెదబయలు ఏరియా కమిటీ మిలీషియా సభ్యులు నలుగురిని వివిధ నేరాలలో పెదబయలు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారని ఓ ఎస్ డి తెలిపారు. వీరు ఈతంగి చిట్టిబాబు, పోతురంగి కోటిబాబు, గొల్లూరి మోదేశ్వరరావు, వంతల కామేశ్వరరావు లు గా ఆయన పేర్కొన్నారు.


లొంగిపోయిన వారంతా మావోయిస్టుల మాటలకు మోసపోయి దళంలో చేరారని, గిరిజన ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను చూసి పోలీస్ ఫ్రెండ్లీ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై తిరిగి జనజీవన స్రవంతిలో కలవాలని లొంగిపోయారని వెల్లడించారు. ఏవోబీలో మావోయిస్టు కార్యక్రమాలు ఇంకా కొనసాగుతూనే వున్నాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ పూర్వం గాలికొండ ఏరియాలో 300 మంది మావోయిస్టులు ఉండేవారని ఇప్పుడు 150 మంది మాత్రమే ఉన్నారని చెప్పారు.