మళ్లీ సేవలు అందించనున్న108 అంబులెన్స్ లు!

  Written by : Suryaa Desk Updated: Tue, Jun 18, 2019, 08:29 PM
 

ప్రజా సంక్షేమంపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. మెరుగైన పాలన అందించే దిశగా సీఎం జగన్ ముందుకెళ్తున్నారు.  వైద్యం, ఆరోగ్యశ్రీ పథకంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆరోగ్యశ్రీని మెరుగుపరిచేందుకు అడుగులు వేస్తున్నారు. ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించేందుకు సిద్ధమయ్యారు. మెరుగైన వైద్యాన్ని ప్రజలకు అందించేందుకు శ్రీకారం చుట్టారు. కనుమరుగైన 108 అంబులెన్స్ లు మళ్లీ సేవలు అందించనున్నాయి.
గతంలో బ్రహ్మాండంగా పని చేసిన 108 అంబులెన్స్ లు ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదని..వాటిని నిర్వీర్యం చేశారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 350 కొత్త 108 అంబులెన్స్ లను కొనుగోలు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. అలాగే ప్రతి మండలానికి అంబులెన్స్ ను కేటాయించేందుకు గానూ మొత్తం 650 అంబులెన్స్ లను కొనుగోలుకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు.
వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆ ఖర్చు ఏ పేదవాడి నెత్తిన పడకూడదని భావించి ప్రభుత్వమే వైద్యానికి అయ్యే ఖర్చును భరిస్తుందని చెప్పారు. అందుకుగాను మెడికల్ అడ్వైజరీ కమిటీని వేశామని తెలిపారు. నిపుణులతో కూడిన డాక్టర్లను సభ్యులుగా చేర్చామని చెప్పారు. వారికి రెండు నెలలపాటు సమయం ఇచ్చామని తెలిపారు.
నాలుగు, ఐదు జిల్లాల్లో పేరు గాంచిన డాక్టర్లతో మాట్లాడి..వారిచ్చే సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకొని ఏం చేస్తే ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించవచ్చో రిపోర్టు తయారు చేయమని చెప్పినట్లు తెలిపారు సీఎం జగన్. సిఫార్సుల అనుగుణంగా దేశం మొత్తం ఏపీ వైపు చూసే విధంగా ఆరోగ్యశ్రీ వైద్యాన్ని అమలు చేస్తామని చెప్పారు.
జీతం రూ.40 వేలు వచ్చే వారికి, సంవత్సరానికి రూ. 5 లక్షల ఆదాయం ఉన్నవారిందరికీ ఆరోగ్యశ్రీ వర్తింప చేసే విధంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. జనవరి 26 నుంచి అమ్మఒడి కింద రూ.15 వేలు అందిస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని జగన్ స్పష్టం చేశారు.