వివాదంలో చంద్రబాబు నివాసం!

  Written by : Suryaa Desk Updated: Tue, Jun 18, 2019, 07:43 PM
 

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నివాసం వివాదంలో చిక్కుకుంది. ఆయన ఉంటున్న ఇల్లు అక్రమ కట్టడం అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. చంద్రబాబు ఇంటిని కూల్చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో కరకట్టపై చంద్రబాబు నివాసం ఉంటున్నారు. అది అక్రమ కట్టడం అని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. అంతేకాదు చంద్రబాబుని అక్రమ నివాసం నుంచి ఖాళీ చేయిస్తామని, ఆ ఇంటిని కూల్చేస్తామని చెబుతున్నారు. చంద్రబాబు నివాసం గురించి ఆర్కే చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో దుమారం రేపుతున్నాయి.
నదీ గర్భంలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతామని ఎమ్మెల్యే ఆర్కే స్పష్టం చేశారు. చంద్రబాబు నివాసం అక్రమ కట్టడం కిందకే వస్తుందన్నారాయన. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇంటిని కూల్చి తీర్చుతామన్నారు. చంద్రబాబుని ఖాళీ చేయిస్తే ఆ ప్రాంతంలో ఉన్న నివాసాలు, విల్లాల సంగతి ఏంటనే కొత్త ప్రశ్న పుట్టుకొచ్చింది. కరకట్ట పక్కన ఉన్న అక్రమకట్టడాలపై చర్చ జరుగుతోంది.
చంద్రబాబు ఇల్లు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉంటుంది. ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేశ్ తనకి చెందిన ఈ ఇంటిని చంద్రబాబుకి ఇచ్చారు. నాలుగేళ్లుగా చంద్రబాబు ఆ ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. ప్రతిపక్ష నేత అయిన తర్వాత కూడా అదే ఇంట్లో ఉంటున్నారు. లింగమనేని రమేశ్ ఇంటిని పునర్ నిర్మించి చంద్రబాబుకి ఇచ్చారు. ఆర్కే చెప్పిన ప్రకారం ఇవన్నీ అక్రమ కట్టడాల కిందకే వస్తాయి. నదీ పరివాహక పరిరక్షణ చట్టం 1890 ప్రకారం కరకట్ట సమీపంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు.
కానీ నిబంధనలకు విరుద్ధంగా కరకట్టపై 5 కిలోమీటర్ల మేర అక్రమ కట్టడాలు కనిపిస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు ఇక్కడ విల్లాలు, ప్రైవేట్ రిసార్టులు నిర్మించుకున్నారు. రిక్రియేషన్ పేరుతో వుడాతో పర్మిషన్ తీసుకుని నివాసాలు నిర్మించుకున్నారు. చంద్రబాబు ఉంటున్న నివాసం ఉండవల్లి పంచాయితీ పరిధిలోకి వస్తుంది. చంద్రబాబు నివాసం కూల్చడానికి రూల్స్ ఏమైనా అడ్డు వస్తాయా? న్యాయస్థానాలను ఆశ్రయిస్తే ఇల్లుని కూల్చకుండా ఆర్డర్ ఇస్తారా? అనే చర్చ జరుగుతోంది. నదీ పరివాహక పరిరక్షణ చట్టాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే నాడు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించిందని ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు.