నా తండ్రి ఆశ‌య‌సాధ‌నే నా ల‌క్ష్యం : అర‌కు ఎంపి

  Written by : Suryaa Desk Updated: Mon, May 27, 2019, 10:31 AM
 

త‌న తండ్రి మాజీ ఎమ్మెల్యే, దివంగ‌త‌ గొడ్డేటి దేముడు ఆశయ సాధనే ల‌క్ష్యంగా త‌న ప‌ని తీరు ఉంటుంద‌ని, నియోజ‌క‌వ‌ర్గంలో ముఖ్యంగా గిరిజనుల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పని చేస్తా’నని అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి వైసిపి అభ్య‌ర్ధిగా గెలుపొందిన గొట్టేటి మాధ‌వి చెప్పారు.  ఎంపీగా విజయం సాధించిన ఆమె త‌న స్వగ్రామమైన శరభన్నపాలెం రావ‌టంతో  గ్రామస్థులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ త‌న తండ్రి దేముడుపై ఉన్న అభిమానం  ప్రేమతో త‌న సోద‌ర‌సోద‌రులు, గిరిజ‌నం త‌న‌ను ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించారని, ఈ విజయం వారికే అంకితం చేస్తున్నాన‌ని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా, నిజాయతీగా పని చేస్తానని, మారుమూల గ్రామాలకు వైద్య సేవల విస్తరణ, తాగునీరు, రహదారి సౌకర్యం కల్పించేందుకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌హాయ స‌హ‌కారాల‌తో కృషి చేస్తానని పేర్కొన్నారు. 


అంత‌కు ముందు వెలగలపాలెంలోని దేముడు సమాధిని సందర్శించి పుష్పగుచ్ఛం ఉంచారు. గ్రామదేవత ఎర్రగొండమ్మ తల్లిని దర్శించుకుని పూజలు చేశారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు, గాం గంటన్న, మల్లుదొర విగ్రహాలకు  పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా  వైకాపా నాయకులు, మాజీ సర్పంచులు మాధ‌వికి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.