కౌన్ బ‌నేగా ఖాకీ బాస్‌!

  Written by : Suryaa Desk Updated: Sun, May 26, 2019, 09:03 PM
 

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి రావడంతో.. డీజీపీ మార్పు తథ్యమన్న ప్రచారం జోరందుకుంది. ప్రస్తుత డీజీపీ ఆర్పీ ఠాకూర్‌.. టీడీపీకి అనుకూలమంటూ మొదట్నుంచీ వాదిస్తున్న జగన్‌ టీమ్.. ఆయన స్థానంలో మరొకరిని తెచ్చేందుకు కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ పోస్టుపై ఆశలు పెంచుకున్న ఓ ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌లు.. తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.. అయితే.. వారిద్దరిలో జగన్ ఎవరివైపు మొగ్గు చూపుతారన్నదే ఇప్పుడు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైఎస్ జగన్.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్‌ను పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఏరికోరి ఎంపిక చేసిన ఠాకూర్‌.. ఎన్నికల్లో  టీడీపీకి ఏజెంట్‌గా పనిచేశారంటూ ఎన్నో సార్లు వైసీపీ నేతలు ఆరోపించారు. గవర్నర్‌కు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులూ చేశారు. ఓ దశలో ఠాకూర్‌పై ఈసీ వేటు వేస్తుందన్న ప్రచారమూ సాగింది. అయితే.. దాన్నుంచి ఠాకూర్‌ సేఫ్‌గా బయటపడ్డప్పటికీ.. వైసీపీ గెలవడంతో.. వేటు తప్పదన్న ప్రచారం ఊపందుకొంది. ఏపీ డీజీపీగా నండూరి సాంబశివరావు రిటైర్‌ అయిన సమయంలో.. కొత్త డీజీపీ రేసులో గౌతమ్‌ సవాంగ్ పేరు బాగా వినిపించింది. అయితే.. అనూహ్యంగా ఠాకూర్‌ను ఎంపిక చేశారు చంద్రబాబు. ఆ సమయంలో సవాంగ్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజునే.. గౌతమ్ సవాంగ్‌ వెళ్లి జగన్‌ను కలవడంతో కొత్త చర్చ మొదలయ్యింది. ప్రస్తుతం విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా ఉన్న సవాంగ్‌ను కొత్త డీజీపీగా జగన్‌ ఎంపిక చేయవచ్చన్న ప్రచారమూ సాగింది. ఇప్పుడు .. కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరో సీనియర్‌ ఐపీఎస్‌ వీఎస్‌కే కౌముది పేరు కూడా తెరపైకి రావడంతో.. వీరిద్దరిలో జగన్ ఎవరిని ఎంపిక చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత డీజీపీ ఆర్పీ ఠాకూర్‌, గౌతమ్‌ సవాంగ్‌, వీఎస్‌కే కౌముది.. ముగ్గురూ 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌లే. వీరిలో కౌముది వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితుడని పేరు. వైఎస్ హయాంలో కీలక పదవుల్లో ఆయన పనిచేశారు. అయితే.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లిపోయారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ డీజీగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.