పోలవరం ప్రాజెక్టుపై రీ టెండర్లు! వైఎస్ జగన్!

  Written by : Suryaa Desk Updated: Sun, May 26, 2019, 08:05 PM
 

పోలవరం ప్రాజెక్టు పనులను సమీక్షించి అవసరమైతే రీ టెండర్లను పిలుస్తామని ఈ నెల 30వ తేదీన సీఎంగా ప్రమాణం చేయనున్న వైఎస్ జగన్ ప్రకటించారు. న్యూఢిల్లీలో ఆదివారం నాడు ప్రధానమంత్రి మోడీతో భేటీ అయిన తర్వాత వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. కానీ, పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాల్సిన అవసరం మాత్రం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తేలితే టెండర్లను రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసేందుకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలో త్వరలో నిర్ణయం తీసుకొంటామని ఆయన తెలిపారు.తన తండ్రి బతికి ఉన్నంత కాలంలో తనపై కేసులు లేవన్నారు. తన తండ్రి  సీఎంగా ఉన్న కాలంలో సెక్రటేరియట్‌లో అడుగుపెట్టలేదన్నారు. ఒక్క మంత్రికి కానీ, ఒక్క సెక్రటరీకి కూడ ఫోన్ చేయలేదన్నారు. తన తండ్రి సీఎంగా ఉన్న కాలంలో తాను బెంగుళూరులోనే ఉండేవాడినని జగన్ గుర్తు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత తనపై కేసులు పెట్టారని జగన్ ఆరోపించారు. ప్రత్యేక హోదా కు కేసీఆర్ సంపూర్ణ మద్దతు ఇస్తానని ప్రకటించారన్నారు. అందుకే ఆయనను మర్యాదపూర్వకంగానే కలిసినట్టుగా జగన్ వివరించారు. ఒకే భాష మాట్లాడే వాళ్లం.... కలిసి కట్టుగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. 31 మంది ఎంపీలు  రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారం కోసం పనిచేయనున్నట్టు జగన్ చెప్పారు. అమిత్ షాను కూడ మర్యాదపూర్వకంగా కలిసినట్టుగా జగన్ తెలిపారు. ప్రధాని మోడీ తర్వాత దేశంలో అతి పవర్ పుల్, ముఖ్యమైన వ్యక్తి అమిత్ షా కాబట్టి ఆయనను కలిసినట్టుగా జగన్ తెలిపారు.