కర్నాటకలో మళ్లీ రాజకీయ సందడి

  Written by : Suryaa Desk Updated: Sun, May 26, 2019, 02:33 PM
 

సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం కర్నాటకలో మళ్లీ రాజకీయ సందడి మొదలైంది. లోక్ సభ ఎన్నికలలో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడంతో రాష్ట్రంలో కూడా అధికారాన్ని చేజిక్కించుకోవడంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణంలో అంతర్గత కుమ్ములాటలు కుమారస్వామి ప్రభుత్వ మనుగడపై అనుమాన మేఘాలు కమ్ముకునేలా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ ఎంపీ ఎస్ఎమ్ కృష్ణతో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా బీజేపీ నాయకుడు అశోక్ కూడా ఎస్ఎమ్ కృష్ణను ఈ రోజు కలుసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ఎస్ఎమ్ కృష్ణను కలుసుకోవడంతో కుమారస్వామి ప్రభుత్వానికి ముప్పు ఏర్పడే అవకాశాలున్నాయన్న వాదన తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుడు అశోక్ మాట్లాడుతూ…తాను ఎస్ఎమ్ కృష్ణను పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడేందుకే కలిశాననీ, ఆయనను కలిసిన కాంంగ్రెస్ నేతలతో తనకు పరిచయం లేదనీ చెప్పారు.