ప్రారంభమైన వైఎస్సార్‌ఎల్పీ సమావేశం

  Written by : Suryaa Desk Updated: Sat, May 25, 2019, 11:16 AM
 

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని వైఎస్సార్‌ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు. వైఎస్‌ జగన్‌ను తమ నేతగా ఎన్నుకోవడానికి కొత్తగా ఎన్నికైన ఆ పార్టీ ఎమ్మెల్యేలు తాడేపల్లిలోని జగన్‌ క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఎన్నికైన ఎమ్మెల్యేలంతా సమావేశానికి హాజరుకావడంతో పార్టీ కార్యాలయం కళకళలాడుతోంది. సమావేశంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకునేందుకు పార్టీ ఎమ్మెల్యేలంతా తీర్మానం చేయనున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు రాకతో జగన్‌ నివాసం వద్ద వాతావరణం సందడి మారింది.


శాసనసభాపక్షం నేతగా జగన్‌ను ఎన్నుకున్న తర్వాత 11.32 గంటలకు అక్కడే వైఎస్సార్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. సమావేశం ముగిశాక జగన్‌.. రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలవడానికి హైదరాబాద్‌ బయలు దేరతారు. జగన్‌ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేల ప్రతినిధి వర్గం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి శాసనసభాపక్షం తీర్మానం కాపీని అందజేసి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేస్తారు. అనంతరం విజయవాడలో 30వ తేదీన జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లను ముమ్మరం చేయనున్నారు.