ఘనంగా ముగిసిన అన్నమయ్య జయంతి ఉత్సవాలు

  Written by : Suryaa Desk Updated: Sat, May 25, 2019, 12:15 AM
 

 పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 611వ జయంతి ఉత్సవాలు శుక్ర‌వారం ఘనంగా ముగిశాయి. మే 18 నుండి 24వ తేదీ వరకు ఏడురోజుల పాటు తిరుపతి, తాళ్లపాకలో అన్నమయ్య జయంతి ఉత్సవాలను టిటిడి వైభవంగా నిర్వహించింది. ఈ ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శుక్ర‌వారం ఉద‌యం 8 గంటలకు శ్రీ కోదండరామస్వామివారి ఆస్థానం ఘనంగా జరిగింది. ముందుగా స్వామివారి ఉత్సవమూర్తులను శ్రీ కోదండరామస్వామివారి ఆలయం నుండి అన్నమాచార్య కళామందిరానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తనా గోష్టిగానం నిర్వహించారు. అనంతరం తిరిగి స్వామివారి ఉత్సవమూర్తులను శ్రీ కోదండరామాలయానికి తీసుకెళ్లారు. ఆ త‌రువాత‌ ఉదయం 10.30 గంటల నుండి మ‌ధ్యాహ్నం 1.00 గంట వరకు తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి ఎం.క‌విత, శ్రీ కె.బాలాజి బృందం గాత్ర సంగీతం, తిరుపతికి చెందిన శ్రీమతి జంధ్యాల కృష్ణకుమారి భాగవతార్‌ ”అన్నమయ్య జీవిత చరిత్ర”పై హరికథ పారాయణం చేశారు.


సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు విజ‌య‌వాడ‌కు చెందిన శ్రీ వి.విశ్వ‌నాథ్ బృందం గాత్రం, అన్న‌మాచార్య ప్ర‌యివేటు క‌ళాకారుల బృందం ప్ర‌త్యేక వాద్య‌సంగీతం వినిపించారు. అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శుక్ర‌వారం సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు హైద‌రాబాద్‌కు చెందిన శ్రీ వి.ఫ‌ణి నారాయణ బృందం వీణ వాద్య సంగీత కార్య‌క్ర‌మం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ బి.విశ్వనాథ్‌, ఏఈవో శ్రీమతి విఆర్‌.శాంతి, రీసెర్చి అసిస్టెంట్ డా.. సి.లత, సిబ్బంది శ్రీ న‌ర‌సింహులు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.