ఖాకీ చొక్కా విప్పేసి ఖద్దరు చొక్కా!

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 08:52 PM
 

గోరంట్ల మాధవ్.. స్టేషన్ సీఐ హోదాలో ఖాకీ చొక్కా విప్పేసి ఖద్దరు చొక్కా వేశారు. చివరి వరకు నామినేషన్ విషయంలో ఏర్పడిన గందరగోళం తర్వాత.. ఎట్టకేలకు బరిలోకి దిగాడు. జస్ట్ 16 రోజుల ప్రచారం. ఎంపీగా గెలిచేశాడు. అందులోనూ రాజకీయ ఉద్దండుడు, మోస్ట్ సీనియర్ పొలిటికల్ ఫ్యామిలీ అయిన జేసీ కుటుంబానికే సవాల్ విసిరి మరీ హిందూపూర్ ఎంపీగా గెలుపొందాడు గోరంట్ల మాధవ్. మాధవ్ కు 6 లక్షల 99 వేల 739 ఓట్లు వస్తే.. ఆయన ప్రత్యర్థి, టీడీపీ టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్పకు 5 లక్షల 61 వేల 602 ఓట్లు వచ్చాయి. లక్షా 38 వేల 137 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు మాధవ్.
మే 23వ తేదీ ఓట్ల లెక్కింపు కేంద్రానికి వెళ్లిన గోరంట్ల మాధవ్‌ను అక్కడ విధుల్లో ఉన్న DSP స్థాయి అధికారి సెల్యూట్ చేయడం.. మాధవ్ కూడా సెల్యూట్ చేయడం ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిన్నటి వరకు ఇదే డీఎస్పీలకు మాధవ్ సెల్యూట్ చేశాడు. ఇప్పుడు ఆ డీఎస్పీ స్థాయి అధికారితో సెల్యూట్ చేయించుకోవటం విశేషం. ఎంపీగా ప్రొటోకాల్ ప్రకారం డీఎస్పీ, సీఐ ఉంటారు. నిన్నటి వరకు ఎంపీలకు ప్రొటోకాల్ ప్రకారం సెక్యూరిటీ ఇచ్చిన గోరంట్ల మాధవ్.. ఇక నుంచి తన కంటే పెద్ద స్థాయి అధికారి ద్వారా ప్రొటోకాల్ ప్రకారం సెక్యూరిటీ పొందనున్నారు. చిత్రం కదా. కాలం తీసుకొచ్చే మార్పు ఎలా ఉంటుందో.. ఓ సామాన్యమైన సీఐ.. రాత్రికి రాత్రి ఎంపీగా గెలుపొందితే ఎలా ఉంటుందో ఈ ఫొటో చెబుతుంది. రాజకీయాలు చేయలంటే గుండె ధైర్యం ఉండాలనే జగన్ మాటలకు.. మాధవ చేతలు నిరూపించాయి అంటున్నారు వైసీపీ అభిమానులు.
తాడిపత్రిలోని ప్రభోదానంద ఆశ్రమ వివాద సమయంలో గోరంట్ల మాధవ్ తెరపైకి వచ్చారు. కదిరి సీఐగా ఉన్నసమయంలో మాధవ్ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో వివాదం ఏర్పడింది. సవాళ్లు, ప్రతి సవాళ్ల తర్వాత మాధవ్ తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. వైసీపీలో చేరిన మాధవ్‌‌ను ఆ పార్టీ హిందూపురం లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరించింది.
ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయి. ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసినప్పటికీ దాన్ని ఏపీ ప్రభుత్వం ఆమోదించలేదు. దీనిపై ఆయన కోర్టు మెట్లు ఎక్కారు. వెంటనే మాధవ్ వీఆర్ఎస్‌కు ఆమోదం తెలపాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీంతో ఆయన వైసీపీ తరపున హిందూపురం లోక్ సభ అభ్యర్థిగా నామినేషన్‌ వేసి ఘన విజయం సాధించారు.