ఎంపీలకు హోటళ్లలో వసతి కల్పించే విధానానికి స్వస్తి!

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 08:08 PM
 

దేశ రాజధాని ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ మంత్రులు విలాసవంతమైన 5 స్టార్ హోటళ్లలో బస చేస్తుంటారు. లోక్ సభ ఎంపీల వసతి కోసం అయ్యే ఖర్చును ఇప్పటివరకూ ప్రభుత్వమే భరించాల్సి వచ్చేది. ఇకపై మునపటిలా పరిస్థితి ఉండదు. ప్రభుత్వం కొత్త రూల్ తీసుకోస్తోంది. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన లోక్ సభ ఎంపీల నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఇక నుంచి అత్యంత ఖరీదైన 5 స్టార్ హోటళ్లలో అధికారిక ఆతిథ్యం లభించదు.  ఎంపీలకు ప్రత్యేకమైన గదులను ఏర్పాటు చేయనున్నారు. లోక్ సభ సెక్రటేరియట్.. హోటళ్లలో అధికారిక వసతి విషయంలో నిబంధనల్లో మార్పులు చేసింది. తద్వారా ప్రభుత్వానికి రూ.30 కోట్ల వరకు ప్రజాధనం సేవ్ కానుంది. ‘ఢిల్లీకి వచ్చిన ఎంపీలకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో వారికి అవసరమైన సదుపాయాలతో పాటు అదనంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎంపీల వసతి కోసం సుమారు 300 గదులను ఏర్పాటు చేశాం’ అని లోక్ సభ సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాస్తవ మీడియా ప్రతినిధులతో చెప్పారు. కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులందరికి వెస్టరన్ కోర్టులో వసతి కల్పించనున్నట్టు తెలిపారు. కొత్తగా నిర్మించిన వివిధ రాష్ట్ర భవనాల్లో కూడా వసతి ఏర్పాట్లు చేశామని చెప్పారు. హోటళ్లలో వసతి కల్పించే విధానానికి స్వస్తి పలుకుతున్నట్టు శ్రీవాస్తవ తెలిపారు.  2014లో ఎంపీలకు సరైన వసతి కల్పించడంలో కొరత కారణంగా ప్రభుత్వం కొత్తగా ఎన్నికైన ఎంపీలు ఉండేందుకు రూ.35 కోట్లు ఖర్చు చేసింది. లగ్జరీ హోటళ్లలో వసతికి రోజుకు రూ. 9వేలు నుంచి రూ.10వేలు వరకు ఉంటుందని ఓ నివేదిక తెలిపింది. ఇప్పటికే పార్లమెంట్ నియోజవర్గంలోని రిటర్నింగ్ అధికారులందరికీ వసతికి సంబంధించి ఏర్పాట్లపై లోక్ సభ సెక్రటేరియట్ సమాచారం అందించినట్టు శ్రీవాస్తవ చెప్పారు. కొత్త ఎంపీలు వినియోగించుకునేందుకు రిటర్నింగ్ అధికారులను నియమించే విషయంలో వివిధ పత్రాలతో కూడిన డాక్యుమెంటేషన్ అడ్వాన్స్ డ్ కాపీలను తొలిసారి పంపించినట్టు ఆమె తెలిపారు. ఎంపీల వసతి కోసం ఏర్పాటు చేసిన సెంట్రల్ హాల్ ను పునరుద్ధరించాక ఎంతో సుందరంగా ఉందని శ్రీవాస్తవ చెప్పారు.