వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి టీటీడీ ఆశీర్వాదం!

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 07:54 PM
 

మొన్నటివరకు  వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్యమతస్తుడనే కారణంతో.. టీటీడీ దేవస్థానంలోకి చెప్పులేసుకుని ప్రవేశించాడని రచ్చ చేశారు కొందరు. అండర్ టేకింగ్ ఇవ్వడానికి నిరాకరించారని వివాదం రేపారు.  ఇప్పుడు ఆయన జాతకం మారిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం పండితులు స్వయంగా జగన్‌ వద్దకు చేరుకుని ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. సార్వత్రికఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ అధినేత జగన్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం ఆశీస్సులు అందించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి నివాసంలో జగన్‌ను ప్రత్యేకంగా కలిశారు టీటీడీ ఈవో అశోక్‌కుమార్‌ సింఘాల్. అనంతరం ఆలయ ప్రధానార్చకులు, వేదపండితులు జగన్‌ను ఆశీర్వదించి.. శ్రీవారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. 
విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం కూడా జగన్‌కు ప్రత్యేకంగా ఆశీస్సులు అందించింది. వేదపండితులు తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి అమ్మవారి తీర్థప్రసాదాలు, మొమొంటోను ఆయనకు అందించారు. ఆలయ ఈవో కోటేశ్వరమ్మ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దుర్గగుడి మరింత అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని జగన్‌ హామీ ఇచ్చారని ఈవో తెలిపారు.