జగన్ కోసం కాన్వాయ్ రెడీ

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 11:27 AM
 

ఈ నెల 30న ఏపీ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ప్రత్యేక కాన్వాయ్ సిద్ధమైంది. నిన్నటివరకూ సీఎంగా ఉన్న చంద్రబాబు కోసం ఉపయోగించిన కాన్వాయ్ కాకుండా... భద్రతా కారణాల రీత్యా... అత్యంత శక్తిమంతమైన, అధునాతమైన, ఎన్నో సెక్యూరిటీ ఫీచర్లు ఉన్న కాన్వాయ్‌ని జగన్ కోసం సిద్ధం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని జగన్ ఇంటి దగ్గర వారం నుంచీ భద్రతను పెంచిన పోలీసులు, ప్రస్తుతం అక్కడ చీమ చిటుక్కుమన్నా కనిపెట్టేసేంత సెక్యూరిటీ ఉంది. ఆ ప్రాంతం మొత్తం మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. చుట్టుపక్కల ఇళ్లలో కూడా ఫార్మాల్టీ కొద్దీ సోదాలు చేశారు. తద్వారా ఆ ప్రాంతం పూర్తిగా సెక్యూరిటీ జోన్‌లోకి వచ్చేసింది. ఇప్పుడది ఫుల్ కంట్రోల్‌లో ఉంది.


వైఎస్ జగన్ కాన్వాయ్ కోసం ఆరు స్ట్రామ్ వాహనాలు సిద్ధం చేశారు. వాటిలో ఒక బులెట్ ప్రూఫ్ వాహనం ఉంది. AP 18P 3418 నంబర్‌తో ఈ కాన్వాయ్ వెళ్తుంది. ఇందులో మొబైల్ సిగ్నల్ జామర్, అంబులెన్స్, సెక్యూరిటీ సిబ్బంది వాహనాల్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇవన్నీ జగన్ ఇంటి ముందు రెడీగా ఉన్నాయి. ఇది తాత్కాలిక కాన్వాయ్ అనీ, మున్ముందు మరో పవర్ ఫుల్ కాన్వాయ్ కూడా సిద్ధమవుతుందని అంటున్నారు.


జగన్ భద్రత బాధ్యతను ఇకపై ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ చేపడుతోంది. జగన్‌కి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ని ఏపీ పోలీస్ శాఖ నియమించింది. జగన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా అమర్లపూడి జోషీని నియమించింది పోలీస్ శాఖ. ప్రస్తుతం ఏపీ సీఎం సెక్యూరిటీ వింగ్‌లో విధులు నిర్వహిస్తున్న జోషి... ఇకపై జగన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు.