ఉత్కంఠ న‌డుమ ఎన్నికైన సిక్కోలు సింహం

  Written by : Suryaa Desk Updated: Fri, May 24, 2019, 07:23 AM
 

శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు మ‌రోమారు విజయం సాధించారు. ఆర్ధ‌రాత్రి వ‌ర‌కు సాగిన ఓట్ల లెక్కింపులో చివ‌రిక్ష‌ణం వ‌ర‌కు నువ్వా నేనా అన్నట్టు సాగిన ఉత్కంఠ పోరులో వైకాపా అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై విజయ బావుటా ఎగురవేశారు.   అర్ధరాత్రి 12గంటలకు 6808 ఓట్ల ఆధిక్యంసాధించారని అధికారులు ప్ర‌క‌టించ‌గా ప్రత్యర్థులు పలు అభ్యర్థనలు లేవనెత్తడంతో అధికారికంగా ఫలితాన్ని ప్రకటించకుండా వేచి చూసారు. చివ‌రికి ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాల‌తో ఫ‌లితం ప్ర‌క‌టించారు. కేవలం టెక్కలి, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో మాత్రమే తెదేపా అభ్యర్థులు గెలిచినప్పటికీ ఈ ఎన్నికల్లో రామ్మోహన్‌నాయుడు విజయం సాధించ‌డం విశేషం.  పలాస, శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గాల్లో అక్కడి శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థుల కంటే కూడా అత్యధిక ఓట్లను సాధించడం వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట‌తోనే అని చెప్ప‌క త‌ప్ప‌దు.