స్వర్ణరథంపై కాంతులీనిన కల్యాణ వెంకన్న

  Written by : Suryaa Desk Updated: Thu, May 23, 2019, 09:33 PM
 

  శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం స్వర్ణరథోత్సవం కన్నులపండుగగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఉత్సవర్లను వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం చేప‌ట్టారు. మధ్యాహ్నం స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పంచ ద్రవ్యాలైన పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం  ఉభయదేవేరులతో కలిసి స్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.   కాగా మే 24వ తేదీన వసంతోత్సవాలు ముగియనున్నాయి. గృహస్తులు(ఇద్దరు) ఒక రోజుకు రూ.516/- చెల్లించి ఈ వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. వసంతోత్సవాల కారణంగా ఆలయంలో ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, అష్టోత్తర శతకలశాభిషేకం, తిరుప్పావ‌డ సేవలను రద్దు చేశారు.


            ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ధ‌నంజ‌య‌,  ఏఈవో శ్రీ ల‌క్ష్మ‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ అనీల్‌ కుమార్‌ ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు