జయలలిత నివాసాన్ని జప్తు చేశాం: ఐటీ శాఖ

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 26, 2019, 12:56 PM
 

ఆదాయపు పన్ను బకాయిల నిమిత్తం దివంగత జయలలిత నివాసమైన వేద నిలయాన్ని జప్తు చేశామని మద్రాసు హైకోర్టుకు ఐటీ శాఖ తెలిపింది. జయ మరణం తర్వాత ఆమె ఆస్తులను నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీని వేయాలని కోరుతూ అన్నాడీఎంకే ప్రముఖుడు పుహలేంది మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. జయలలితకు రూ. 913 కోట్లకు పైగా ఆస్తులున్నాయని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి చెన్నై ఐటీ అధికారులు ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. పోయస్ గార్డెన్ లోని జయ నివాసమైన వేద నిలయంతో పాటు ఆమె ఆస్తులను జప్తు చేసినట్టు అందులో పేర్కొన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ రిటర్న్స్ ప్రకారం జయకు రూ. 16.37 కోట్ల విలువైన స్థలం, కారు, బ్యాంక్ లో రూ. 10 కోట్లు ఉన్నాయి. 1990 నుంచి 2012 వరకు జయ పన్ను చెల్లింలేదు. ఇదే విధంగా 2005-06 నుంచి 2011-12 వరకు రూ. 6.62 కోట్ల పన్ను చెల్లించలేదు. ఈ నేపథ్యంలో వేద నిలయంతో పాటు హైదరాబాదులో ఉన్న ఇల్లు, మరో మూడు ఆస్తులు జప్తు చేశామని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో ఐటీ అధికారులు తెలిపారు. రూ. వెయ్యి కోట్ల విలువ ఉండే జయ ఆస్తుల నిర్వహణకు ప్రత్యేక కమిటీ వేయాలని కోరడం సరికాదని అన్నారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.