వ‌రాహ‌స్వామివారి ఆల‌యంలో శాస్త్రోక్తంగా అష్ట‌బంధ‌నం స‌మ‌ర్ప‌ణ‌

  Written by : Suryaa Desk Updated: Thu, Apr 25, 2019, 11:46 PM
 

తిరుమ‌ల‌లోని శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆలయంలో జ‌రుగుతున్న అష్ట‌బంధ‌న బాలాల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాల్లో భాగంగా గురువారం శాస్త్రోక్తంగా అష్ట‌బంధ‌నాన్ని స‌మ‌ర్పించారు. ఉద‌యం, సాయంత్రం యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు, ప్ర‌బంధ గోష్టి, వేద‌పారాయ‌ణం చేప‌ట్టారు.  టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు పాల్గొన్నారు.         ముందుగా పుష్క‌రిణి వ‌ద్ద‌గ‌ల శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద అష్ట‌బంధ‌న చూర్ణం త‌యారీ కార్యక్ర‌మం జ‌రిగింది. శంఖచూర్ణం, మధుజ (తేనెమైనం), లాక్షా(లక్క), గుగ్గులు(వృక్షపు బంక), కార్పాసం(ఎర్ర పత్తి), త్రిఫలం(ఎండిన ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ), రక్తశిలాచూర్ణము (గైరికము) త‌దిత‌ర ద్ర‌వ్యాల‌ను రోటిలో వేసి దంచారు. శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆధ్వ‌ర్యంలో ఈ కార్యక్ర‌మం జ‌రిగింది. శ్రీ వ‌రాహ‌స్వామివారి మూల‌మూర్తితోపాటు శ్రీ విష్వ‌క్సేనుల‌వారు, శ్రీ రామానుజాచార్యుల‌వారు, పుష్క‌రిణి వ‌ద్ద‌గ‌ల శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి విగ్ర‌హాల‌కు అష్ట‌బంధ‌నాన్నిస‌మ‌ర్పించారు. విగ్రహం చుట్టూ కదలికలు లేకుండా ధృడంగా ఉండేందుకు పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైఋతి, పశ్చిమం, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్య దిక్కుల్లో ఈ చూర్ణాన్ని స‌మ‌ర్పించారు.        అష్టబంధనం ద్ర‌వ్యాల్లోని శంఖచూర్ణంతో చంద్రుడిని, తేనెమైనంతో రోహిణీని, లక్కతో అగ్నిని, గుగ్గులుతో చండను, ఎర్ర పత్తితో వాయువును, త్రిఫల చూర్ణంతో హరిని , గైరికముతో స్కందుడిని, గేదె వెన్నతో యముడిని ఆరాధిస్తారు. ముందుగా ఈ ద్రవ్యాలను శుభ్రపరిచి ఆచార్యుల సమక్షంలో సంప్రదాయ శిల్పులు రోటిలో వేసి 30 నిమిషాలు బాగా దంచుతారు. బాగా దంచిన తరువాత అది పాకంగా తయార‌వుతుంది. ఈ పాకం చల్లబడిన తరువాత ముద్దగా చేసుకుంటారు. ఈ ముద్దను గంటకు ఒక్కసారి చొప్పున 8 మార్లు కావలసిన వెన్నను చేర్చుతూ దంచుతారు. ఈ విధంగా వచ్చిన పాకాన్ని ముద్దలుగా తయారుచేస్తారు.