అక్ర‌మ సంబంధం కొనసాగించాల‌ని ప్రియుడి హల్ చల్!

  Written by : Suryaa Desk Updated: Thu, Apr 25, 2019, 09:41 PM
 

గుంటూరు జిల్లాలో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. గతంలో తనతో పెట్టుకున్న వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలని ఓ వ్యక్తి వివాహిత ఇంటి ముందు హల్‌చల్ చేశాడు. రాజమండ్రికి చెందిన తాటిపాక పెద్దరాజు గుంటూరులో నాలుగేళ్ల క్రితం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండగా ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో అతను తన ఇంట్లో పెద్దరాజుకు ఆశ్రయమిచ్చాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తి భార్యతో పెద్దరాజు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అనంతరం వీరిద్దరూ కేరళకు పారిపోయారు. అయితే తనకు చిన్నపిల్లలు ఉన్నారనీ కుటుంబ సభ్యుల ద్వారా నచ్చజెప్పిన సదరు భర్త, భార్యను వెనక్కు తెచ్చుకున్నాడు. అయితే గుంటూరులోనే ఉంటే కాపురానికి ఇబ్బంది అని వినుకొండకు మారిపోయారు. కానీ ఈ విషయం తెలుసుకున్న పెద్దరాజు గురువారం వినుకొండలో వారి ఇంటి ముందుకు వచ్చి రచ్చరచ్చ చేశాడు. తనతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశాడు. దీంతో భార్యాభర్తలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు పెద్దరాజును పోలీస్ స్టేషన్‌కు తరలించారు.  కాగా.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పెద్దరాజు వాష్ రూమ్‌కు వెళుతున్నట్లు నటించి అక్కడి నుంచి గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు అతడిని క‌ట‌క‌టాల్లో కూర్చోబెట్టారు. కేసు న‌మోదు చేసి విచార‌ణ చేస్తున్నారు.