బీజేపీ, వైసీపీ ఓటమి ఖాయం : మంత్రి నక్కా ఆనందబాబు

  Written by : Suryaa Desk Updated: Thu, Apr 25, 2019, 09:03 PM
 

రాష్ట్రంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే చర్యలు జరుగుతున్నాయని మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ.. సీఎస్‌గా ఎల్వీ సుబ్రమణ్యం నియామకం జరిగినప్పటి నుంచి తన పరిధికి మించి ఆయన వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల వ్యవహారాల్లోనూ ఆయన తలదూర్చడం కుట్ర కోణాలకు  తావిస్తోందన్నారు. సీఈవో పనికూడా సీఎస్‌ నిర్వహించడం.. కుట్రలో భాగమేనన్నారు. జగన్మోహన్‌రెడ్డికి అనుకూలంగా తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు కుట్రలకు పాల్పడుతుంది జగమెరిగిన సత్యమన్నారు. వారి కుట్రలలో ఈసీ కూడా భాగస్వామి అయిందని.. అందులో భాగంగానే అధికారుల బదిలీలు జరిగాయన్నారు. తాము  వేసిన ఓట్లపై ప్రజలలో అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో 50% వీవీ ప్యాట్‌లు లెక్కించవలసిన అవసరం ఉందన్నారు. ఎన్నికల అనంతరం జగన్మోహన్‌రెడ్డి ఏమైపోయారో ఎవరికీ తెలియదన్నారు. పార్టీ కనుమరుగుకాకుండా వైసీపీ నాయకులు మాత్రం ప్రెస్‌మీట్లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ముక్కుపచ్చలారని పసివాడు నారా దేవాన్ష్‌పై కూడా రాజకీయ విమర్శలు చేస్తున్న విజయసాయిరెడ్డికి కుటుంబ వ్యవస్థపై ఏం గౌరవముందని ఆనందబాబు ప్రశ్నించారు. చెన్నైలో ఆడిటర్‌గా ఉన్న విజయసాయిరెడ్డి.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆంధ్రప్రదేశ్‌లో తిష్టవేసి క్విడ్‌ ప్రోకో, మనీ లాండరింగ్‌ వంటి ఆర్థిక నేరాలను రాష్ట్రానికి పరిచయం చేశారన్నారు. మోదీ మోటల్లో ఓటమి భయం కొట్టొచ్చినట్లు కనబడిందని ఆనందబాబు అన్నారు. మోదీని నమ్ముకుని ఎన్నికలకు వెళ్లిన జగన్మోహన్‌రెడ్డి ఓటమిని కూడా రాష్ట్ర ప్రజలు ఏనాడో ఖాయం చేశారని తెలిపారు.