స్థానిక పోరుకు ర‌డీఅవ్వండి : పార్టీ శ్రేణుల‌కు సీఎం చంద్ర‌బాబు పిలుపు

  Written by : Suryaa Desk Updated: Thu, Apr 25, 2019, 08:58 PM
 

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాగానే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని తెదేపా అధినేత, ఏపి సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.  పార్టీ నేతలతో చంద్రబాబు గురువారం ఉద‌యం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయ‌న స్థానిక పోరుకు సిద్దంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సీఎం పిలుపునిచ్చారు. అధికారం కోసం ప్రతిపక్షం ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేసిందని మండిపడ్డారు. అయినా అన్నింటినీ సమర్థంగా ఎదుర్కున్నామన్నారు. ప్రజాస్వామ్యం కోసం తాము చేసే పోరాటం అందరిలో స్ఫూర్తి నింపుతోందన్నారు. ఎవరు ఎంత దుష్ర్పచారం చేసినా మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని స్పష్టం చేశారు. ఈవీఎంలపై తమ పోరాటం ఈనాటిది కాదని చంద్రబాబు తెలిపారు. ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి వచ్చేవని.. సార్వత్రిక ఎన్నికలు అవ్వగానే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని వాటికి సిద్ధంగా ఉండాలని నేతలకు సూచించారు. తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేదన్న చంద్రబాబు.. ఇంటర్‌ పరీక్షలపై తెలంగాణ సీఎం సమీక్ష పెడితే ఎవరూ నోరు మెదపరని, ఇక్కడ తాము ఏదైనా సమీక్ష పెడితే మాత్రం నానా యాగీ చేస్తారని దుయ్యబట్టారు. ఈసీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే పాలన అస్తవ్యస్తం అవుతుందని సీఎం అన్నారు.  ఈ ఐదేళ్లు అధికారులు తమకెంతో సహకరించారని, వారి సహకారంతోనే అనేక రంగాల్లో ఏపీ మొదటిస్థానంలో నిలిచిందన్నారు. అలాంటిది ఇప్పుడు ఈసీ రూపంలో అధికారుల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కులం, మతం, వ్యక్తిగత అజెండాలతో అధికారుల మధ్య చీలిక తెచ్చే కుట్ర పన్నారని, దీనిని కూడా సమర్థంగా తిప్పికొడదామని నేతలకు పిలుపునిచ్చారు. ఈసీ ఏకపక్షంగా వ్యవహరించినప్పుడు దానికి ఎలా గుణపాఠం చెప్పాలో అలానే చెబుదామని అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు