సొంత స‌ర్వేల‌తో జ‌గ‌న్ ధీమా

  Written by : Suryaa Desk Updated: Sun, Apr 21, 2019, 06:42 AM
 

 ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసినా ఫలితాలపై మాత్రం ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. ఫలితాలు మే ఇరవై మూడున వెల్లడి కాబోతున్న సంగతి తెలిసిందే. దానికి ఇంకా చాలా సమయం ఉంది. మరి ఫలితాలు ఎలా ఉంటాయనే అంశంపై కొంత స్పష్టత తెచ్చుకోవడానికి ఎగ్జిట్ పోల్స్ ను నమ్ముకుందామంటే అవి కూడా ఇప్పట్లో విడుదల అయ్యేలా లేవు.ఇలాంటి నేపథ్యంలో ఫలితాలపై ఎవరికి  వారు స్పస్టత తెచ్చుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. ఇందు కోసం రాజకీయ నేతలు సర్వేలనే నమ్ముకున్నట్టుగా  తెలుస్తోంది. ప్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు, పోస్ట్ పోల్ సర్వేలు..ఇలా ఎన్నో సర్వేలను చేయించుకున్నారు, చేయించుకుంటున్నారట నేతలు. అందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఆరు సర్వేలను చేయించుకున్నారట. వేర్వేరు సర్వే సంస్థలతో జగన్ ఆ సర్వేలను చేయించుకున్నట్టుగా సమాచారం. ఒకవైపు ప్రశాంత్ కిషోర్ టీమ్ ద్వారా జగన్ వివిధ అంచనాలను వేయించుకొంటూ వచ్చారు.  అదే సమయంలో ప్రత్యేక టీమ్ ల ద్వారా సర్వేలు కూడా చేయించుకున్నారని తెలుస్తోంది.  వాటి ప్రకారం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏపీలో వందకు తగ్గకుండా సీట్లు వస్తాయని తేలిందట. ఈ మేరకు సమాచారం అందుతూ ఉంది. అలా భిన్నమైన సర్వే సంస్థలు అలాంటి పాజిటివ్ రిజల్ట్స్ ను చూపిస్తూ ఉండటంతో.. జగన్ మోహన్ రెడ్డి ధీమాగా ఉన్నారని సమాచారం!