చెత్తకుప్ప‌లో దర్శనమిచ్చిన ఓటరు కార్డులు

  Written by : Suryaa Desk Updated: Sat, Apr 20, 2019, 08:25 PM
 

ఏపీ ఎన్నికల్లో సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. మహా విశాఖ 60వ వార్డు పరిధి డ్రైవర్స్‌ కాలనీ ఆర్చ్‌ సమీపంలో సుమారు 200 ఓటరు కార్డులు డస్ట్‌ బిన్‌ వద్ద కుప్పలుగా పడి ఉన్నాయి. వీటిని చూసిన స్థానికులు విస్తుపోయారు. జాబితాలో పేర్లు లేనివారు, కొత్తగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న యువత ఆయా కార్డుదారుల్లో ఉన్నట్టు ఫొటోలను బట్టి తెలుస్తోంది. వీరిలో కొందరు కుంచుమాంబ కాలనీ, శ్రీనివాసనగర్‌ ప్రాంతాలకు చెందినవారిగా స్థానికులు గుర్తించారు. కార్డులను స్థానిక టీడీపీ నాయకుడు శంకరరావు తీసుకుని కవరులో భద్రపరిచారు. నియోజకవర్గంలో సుమారు 40 వేల మంది కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 35 వేల మందికి ఓటరు గుర్తింపు కార్డులు కూడా మంజూరుచేశారు. వాటిలో కొన్నింటిని ప్రాంతాల వారీగా బీఎల్‌వోలు పంపిణీ చేశారు. మరికొందరు జోనల్‌ కార్యాలయానికి వెళ్లి తీసుకున్నారు. అయినప్పటికీ సుమారు 50 మందికి కార్డుల పంపిణీ కాలేదు. పోలింగ్‌ ముగిశాక కార్డులు చెత్తలో దర్శనం ఇవ్వడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.