టీటీవీ దినకరన్‌కు సుప్రీంలో చుక్కెదురు

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 26, 2019, 05:51 PM
 

ప్రెషర్‌ కుక్కర్‌ను తమ పార్టీ గుర్తుగా కేటాయించాలంటూ ఏఎంఎంకే టీటీవీ దినకరన్‌ చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. అయితే అమ్మా మక్కల్‌ మున్నేత్ర కళగమ్‌ (ఏఎంఎంకే) పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు ఇవ్వని నేపథ్యంలో ఆ పార్టీ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులందరికీ ఒకే గుర్తు కేటాయించే అవకాశం ఉంటే పరిశీలించాలని ఎన్నికల సంఘానికి ధర్మాసనం సూచించింది. ఇలా ఒకే గుర్తు కేటాయించినంత మాత్రాన ఆ అభ్యర్థులందరినీ ఒకే పార్టీకి చెందిన వారిగా గుర్తించలేమని, ప్రస్తుతానికి వారందరినీ స్వతంత్రులుగానే పరిగణించాలని ఈసీని ధర్మాసనం ఆదేశించింది. ఒక పార్టీకి గుర్తింపు ఇవ్వాలా? వద్దా? అనేది పూర్తిగా ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుందని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. తమిళనాడు సహా పుదుచ్ఛేరిలో జరగనున్న లోక్‌సభ, శాసనసభ ఉపఎన్నికల్లో ఈ పార్టీ తరఫున అభ్యర్థులు బరిలో దిగనున్నారు.