ఆచితూచి అభ్య‌ర్థుల ఎంపిక‌..!

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 18, 2019, 07:04 PM
 

అసెంబ్లీ, లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థుల ఎంపిక‌లో వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశారు. సామాజిక స‌మీక‌ర‌ణాల‌ను దృష్టిలో ఉంచుకుని, జ‌న‌సేన‌, టీడీపీల నుంచి ఎదుర‌య్యే స‌వాళ్ల‌ను అధిగ‌మించేలా నేత‌ల‌ను ఎంపిక చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయా నియోజ‌క‌వ‌ర్గాల స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లుగా ప‌నిచేస్తున్న నేత‌లు, గ‌త ఎన్నిక‌ల్లో బ‌రిలో నిలిచిన అభ్య‌ర్థుల నుంచి ఎటువంటి వ్య‌తిరేక‌త ఎదుర‌వ‌కుండా ముందస్తు స‌ర్దుబాట్లు పార్టీకి మ‌రింత మేలు చేశాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. అంతే కాకుండా జ‌గ‌న్ ముంద‌స్తు అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న అధికార పార్టీలో కొంత మంది నేత‌ల‌కు ఆందోళ‌న‌గా ప‌రిణ‌మించిన‌ట్టు తెలుస్తోంది. 
క‌డ‌ప‌, క‌ర్నూలు, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ ద‌ఫా కుల స‌మీక‌ర‌ణ‌ల‌ను కేంద్రంగా చేసుకుని వైసీపీ అభ్య‌ర్థుల ఎంపిక చేసింది. ముఖ్యంగా కుల ప్ర‌భావం అధికంగా ఉండే కోస్తా జిల్లాల్లో గ‌తానికి భిన్నంగా ఈ ద‌ఫా.. క‌మ్మ వ‌ర్గానికి ప్రాధాన్య‌త‌నిచ్చారు. సీమ జిల్లాల్లో టీడీపీ రెడ్ల‌లో చీలిక తెచ్చి లాభ‌ప‌డ‌దామ‌ని వేసిన ప్లాన్‌ను.. జ‌గ‌న్ కోస్తా జిల్లాల్లో క‌మ్మ వ‌ర్గాన్ని రెండు చీల్చ‌టం ద్వారా స‌మానం చేసిన‌ట్టుగా పార్టీ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. జ‌గ‌న్‌పై ఉన్న కుల ముద్ర‌ను చెరిపివేసేందుకు తొలి జాబితాలోనే బీసీ, ఎస్సీ, ఇత‌ర వ‌ర్గాలు ఉన్నాయ‌నే సంకేతాలు పంపారు. ఇవ‌న్నీ జ‌గ‌న్ ఎంత వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నార‌నేందుకు నిద‌ర్శ‌నంగానే విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.