ఓటు అడిగే అధికారం టీడీపీకే ఉంది : చంద్రబాబు

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 18, 2019, 04:33 PM
 

ప్రజలను ఓటు అడిగే అధికారం వైసీపీకి లేదని.. టీడీపీకే ఉందని తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని టంగుటూరి ప్రకాశం పంతులు గ్రౌండ్స్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడుతూ… ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. ఐదేళ్లలో గ్రామాల రూపురేఖలు మార్చామన్నారు. రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే పేదవాడికి న్యాయం జరుగుతుందన్నారు. వైసీపీ వాళ్లు అధికారం లేనప్పుడే హత్యలు చేస్తున్నారంటే… అధికారంలో వస్తే ఏం చేస్తారో మీరే ఆలోచించుకోవాలన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ నాయకులు డ్రామాలాడుతున్నారన్నారు. వివేకానందరెడ్డికి గుండెపోటు అంటే ఎవరైనా నమ్ముతారా అని చంద్రబాబు ప్రశ్నించారు. వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా ప్రకాశం జిల్లాకు నీళ్లిస్తామని  అన్నారు.  రైతు రుణమాఫీ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ కింద రూ.5లక్షలు ఇస్తున్నామన్నారు. ఆహార భద్రత కింద 5కిలోల బియ్యం ఇస్తున్నామన్నారు. వెనుకబడిన వర్గాలకు టీడీపీ కంచుకోట అన్నారు. ఆదరణ-1, ఆదరణ-2 పథకం మనమే అమలు చేశామన్నారు. రూ.20వేల కోట్లు పసుపు-కుంకుమ పథకం కింద ఇచ్చామన్నారు. వైసీపీ నేతలు పసుపు-కుంకుమ తుడిచేస్తున్నారన్నారు.ఫెడరల్ ఫ్రంట్ లో ఉండేది టీఆర్ఎస్, వైసీపీ  పార్టీలు మాత్రమేనని అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ లో ఎవరూ చేరరని అన్నారు. కేసీఆర్, జగన్ లు మోడీతో కుమ్మక్కయ్యారన్నారు. ఆ విషయం ప్రజలందరికీ తెలిసిందేనని అన్నారు. నా దగ్గర పనిచేసేని కేసీఆర్ కే అంత ఉంటే.. నాకెంత ఉండాలని చంద్రబాబు అన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ కు సంబంధించినవన్నారు. కోడికత్తి పార్టీ ఎన్నో కుట్రలు చేస్తుందన్నారు.